- చెపాక్ నుంచి నాడు కరుణానిధి
- నేడు ఉదయనిధి స్టాలిన్ గెలుపు
చెన్నై: డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు, నటుడు, పార్టీ యువజన విభాగం నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ఘన విజయం సాధించారు. స్టాలిన్ కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీచేశారు. తన సమీప ప్రత్యర్థి, ఏఐఎడీఎంకే అభ్యర్థిపై భారీ ఆధిక్యతతో గెలిచారు. 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 156 స్థానాల్లో డీఎంకే విజయం ఖాయం చేసుకుంది. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చంతా చెపాక్ నియోజకవర్గంపైనే నడుస్తోంది. దానికి కారణం సినీహీరో, స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అక్కడి నుంచి గెలుపొందడమే.
చెపాక్ నియోజకవర్గానికి, కరుణానిధి కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఉదయనిధి స్టాలిన్ తాత దివంగత కరుణానిధి ఇక్కడినుంచే ప్రాతినిథ్యం వహించారు. 1996, 2001, 2006 ఎన్నికల్లో ఇక్కడి నుంచే మూడుసార్లు గెలిచిన కరుణానిధి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2008లో చెపాక్, ట్రిప్లికేన్ ప్రాంతాలను విలీనం చేశారు. 2011, 2016 అసెంబ్లీ ఎన్నికల్లోనూ డీఎంకే ఇక్కడ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు తాతస్థానంలో బరిలోకి దిగిన ఉదయనిధి స్టాలిన్ కూడా విజయం సాధించి తాతకు తగిన మనవడిగా పేరు తెచ్చుకున్నారు. అటు సినిమా గ్లామర్.. ఇటు పొలిటికల్ ఇమేజీతో ఉదయనిధి కుటుంబ వారసత్వాన్ని నిలబెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు, సినీప్రముఖులు ప్రసంశలు కురిపిస్తున్నారు.