- రాయితీ సిమెంట్ తో ప్రైవేట్ పనులు
- బిజినపల్లి రోడ్ డివైడర్ పనుల సిమెంట్ పక్కదారి,
- కాంట్రాక్టర్, ఆర్అండ్ బీ అధికారుల కుమ్మక్కు
- పట్టించుకోని ఉన్నతాధికారులు
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో:నాగర్ కర్నూల్ జిల్లాలో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు అయ్యారు. ప్రభుత్వ నిర్మాణ పనుల కోసం సబ్సీడీ పై అతి తక్కువ ధరకు ఇచ్చే సిమెంట్ ను కాంట్రాక్ట్రర్లు దర్జాగా అమ్ముకొంటున్నారు. ప్రభుత్వ నిర్మాణాలను వాడాల్సిన రాయితీ సిమెంట్ ను ప్రైవేట్ నిర్మాణ పనులకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని పట్టించుకోవాల్సీన అధికారులు సైతం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తమ వంతు పర్సెంటేజీలు తీసుకుంటూ చోద్యం చూస్తున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో చోటు చేసుకుంది.
బిజినపల్లి మండల కేంద్రంలో గత కొంత కాలంగా రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. దీని కోసం బిజినపల్లి మండల కేంద్రంలో వనపర్తి, హైద్రాబాద్, మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్ రూట్లలో డివైడర్ నిర్మాణ పనులు ప్రారంభించారు. దీని కోసం భారీగా సిమెంట్ అవసరం ఉండడంతో ప్రభుత్వం నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ కు రాయితీ పై అతి తక్కువ ధరకు బిర్లా ఏ1 గ్రేడ్ సిమెంట్ ను సరఫరా చేస్తొంది. వాస్తవానికి ఇదే సిమెంట్ బయటి మార్కెట్ లో 300 రూపాలయకు పైగా ఉంటున్నా ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్ట్ ర్ కు మాత్రం అతి తక్కువ ధరకే రాయితీ పై సిమెంట్ అందిస్తోంది. పైగా రాయితీ సిమెంట్ బస్తాలపై ప్రత్యేకంగా నాట్ ఫర్ రీసేల్ అని స్పష్టంగా రాసి ఉంటుంది. ఈ రాయితీ సిమెంట్ ను దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ప్రైవేట్ పనులకు రాయితీ సిమెంట్…నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న రాయితీ సిమెంట్ పక్కదారి పడుతోంది.
అధికారుల అండదండలతో రాయితీ పై ప్రభుత్వం అందజేస్తున్న సిమెంట్ ను సదరు కాంట్రాక్టర్ ప్రైవేట్ పనులకు దర్జాగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. బిజినపల్లి మండల కేంద్రంలో రోడ్డు డివైడర్ పనులకు వాడాల్సిన సిమెంట్ ఇదే మండలంలోని వెలుగొండ గ్రామంలోని ఓ ప్రైవేట్ వ్యక్తి ఇంటి నిర్మాణం వద్ద దర్శనమిస్తోంది. ప్రభుత్వ పనులకు వాడాల్సిన ఈ సిమెంట్ ను ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసి బహిరంగంగానే నాట్ ఫర్ రీసేల్ అని రాసి ఉన్న సిమెంట్ బస్తాలను ప్రైవేట్ పనులకు వాడుకోవడాన్ని చూసి అందరూ విస్తుపోతున్నారు. ప్రభుత్వ రాయితీ ఇచ్చిన సిమెంట్ బహిరంగంగానే ప్రైవేట్ వ్యక్తులు తమ ఇంటి నిర్మాణాలకు వాడుతున్నా ఆర్ అంఢ్ బీ అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రభుత్వ రాయితీ సిమెంట్ ను దర్జాగా ప్ర్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వం రాయితీ ఇచ్చిన సిమెంట్ దుర్వినియోగం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.