Breaking News

హవ్వా.. ఇవేం ఫలితాలు..!

హవ్వా.. ఇవేం ఫలితాలు..!
  • ఇంటర్ ఫలితాల్లో చతికిలపడిన సర్కారు జూనియర్ కాలేజీలు
  • సెల్ప్ ఎగ్జామ్ సెంటర్లు మినహా అన్ని కాలేజీల్లో పడిపోయిన రిజల్ట్
  • కొంపముంచిన ఇంచార్జ్​ డీఐఈఓల మొక్కుబడి పర్యవేక్షణ
  • వనపర్తి జిల్లాలో అరకొర రిజల్ట్స్ తో అడ్మిషన్లపై ప్రభావం

సామాజికసారథి, వనపర్తి బ్యూరో: ప్రభుత్వ విద్యాభివృద్దికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. వనపర్తి జిల్లాలో ఇంటర్ ఫలితాలను పరిశీలిస్తే గురుకులాలు, కేజీబీవీ లు, మోడల్ కాలేజీ లు ఫలితాల్లో ముందంజలో ఉన్నా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మాత్రం అట్టడుగుకు పోయాయి. వనపర్తి జిల్లాలో మొత్తం 14 మండలాలు ఉండగా 12 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో వనపర్తి బాయ్స్, వనపర్తి గర్ల్స్ , ఆత్మకూరు జూనియర్ కాలేజీల్లో ఒకేషనల్ కోర్సులు కూడా ఉన్నాయి. ఈ ఏడాది 12 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొత్తం 3360 మంది స్టూడెంట్లు ఇంటర్ పరీక్షలకు హాజరుకాగా కేవలం 1469 మంది స్టూడెంట్లు మాత్రమే పాస్ కావడం ఇంటర్ విద్యాశాఖ అధికారుల పనితీరుకు అద్దంపడుతోంది. వారిలో ఇంటర్ ఫస్టియర్ లో 1712 మందికి కేవలం 643 మంది, సెకండియర్ లో 1648 మందికి కేవలం 836 మంది స్టూడెంట్లు మాత్రమే పాసయ్యారు.

మొక్కుబడి పర్యవేక్షణ
జిల్లాలో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్ విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం ఇంటర్ ఫలితాలపై స్పష్టంగా కనపడుతోంది. వనపర్తి జిల్లాలో గత అకాడమిక్ ఇయర్ లో ఇంచార్జీ డీఐఈఓలుగా ఇద్దరు పనిచేసినా కాలేజీల్లో విద్యాప్రమాణాలు మాత్రం పెరగలేదు. ఇంచార్జీ డీఐఈఓ లుగా జూనియర్ కాలేజీల్లో సీనియర్ ప్రిన్సిపాళ్లను నియమించడంతో కాలేజీల పర్యవేక్షణ అస్తవ్యస్థంగా మారుతోంది. వనపర్తి జిల్లాలో గత డీఐఈఓ పదవివిరమణ చేయగా మొదట సీనియర్ ప్రిన్సిపాల్ అయిన ప్రకాశం శెట్టి ని ఇంచార్జీ డీఐఈఓ గా నియమించారు. కాని ఆయన కాలేజీల్లో రాజకీయాలు, ఇతర ఒత్తిళ్లతో డీఐఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత సీనియర్ గా ఉన్న వనపర్తి గవర్నమెంట్ ఉర్దూ మీడియం ప్రిన్సిపాల్ జాకీర్ హుస్సేన్ ఇంచార్జీ డీఐఈఓగా బాధ్యతలు తీసుకున్నా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలను గాడిన పెట్టలేకపోయారు. సరిచేయాల్సిన జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో స్టూడెంట్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.

అట్టడగుకు చేరిన కొత్తకోట కాలేజీ
కొత్తకోట గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్ అక్కడి లెక్చరర్ల మధ్య ఉన్న వర్గపోరును నివారించడంలో డీఐఈఓ జాకీర్ హుస్సేన్ ఫెయిల్ అయ్యారు. కాలేజీలో పరిష్కారం అయ్యే చిన్న సమస్యను మరింత పెద్దగా చేసి ప్రిన్సిపాల్ ను వెనకేసుకురావడంతో కొత్తకోట కాలేజీ స్టూడెంట్లు ఏకంగా ఇంటర్ బోర్డు కమీషనర్ కు ఫిర్యాదు చేయాల్సీన పరిస్థితి కల్పించారు. అంతేకాకుండా సరిగ్గా ఇంటర్ పరీక్షల సమయంలో కొత్తకోట కాలేజీలో ఏకంగా నలుగురు కాంట్రాక్ట్ లెక్చరర్లను బదిలీ చేయించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొత్తకోట జూనియర్ కాలేజీలో సెకండియర్ లో 72 మందికి 17 మంది, ఫస్టియర్ లో 98 మందికి కేవలం 8 మంది పాస్ కావడం ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది.

అడ్మిషన్లు ఇలా..
వనపర్తి జిల్లాలో మొత్తం 12 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఉండగా కేవలం సెల్ప్ ఎగ్జామ్ సెంటర్లు ఉన్న కాలేజీల్లో మాత్రమే రిజల్ట్ అధికంగా ఉండటం మిగిలిన కాలేజీల్లో అధ్వానంగా రిజల్ట్ ఉంటున్నాయి. ఫస్టియర్ లో జిల్లాలోని వనపర్తి గర్ల్స్ జూనియర్ కాలేజీలో 139 మందికి కేవలం 14, వనపర్తి ఉర్దూమీడియం కాలేజీలో 31 మందికి 19, ఆత్మకూర్ లో 144 మందికి 33, శ్రీరంగాపూర్ లో 74 మందికి 7, గోపాల్ పేటలో 106 మందికి 44, కొత్త కోట లో 98 మందికి 8 , పెద్దమందడిలో 82 మందికి 42, పెబ్బేరు లో 83 మందికి 17 చొప్పున పాస్ కావడం ఇంటర్ అద్వాన్న ఫలితాలకు నిదర్శనంగా చెప్పొచ్చు. సెకండియర్ లో కొత్తకోట లో 72 మందికి 17, వనపర్తి బాయ్స్ కాలేజీలో 230 మందికి 34, గర్ల్స్ కాలేజీలో 205 మందికి 104, గోపాల్ పేటలో 103 మందికి 58, శ్రీరంగాపూర్ లో 66 మందికి 19, ఆత్మకూర్ లో 139 మందికి 59 , ఖిల్లాఘనపురం లో 66 మందికి 36, వనపర్తి ఉర్దూమీడియం కాలేజీలో 39 మందికి 22 చొప్పున పాస్ కావడం జిల్లాలో ఇంటర్ విద్య పరిస్థితికి అద్దంపడుతోంది. ఇప్పటికే గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో జిల్లా కేంద్రంలోని కాలేజీలను మినహాయిస్తే మిగిలిన కాలేజీల్లో రెండంకెల సంఖ్య కూడా అడ్మిషన్లు దాటని పరిస్థితి ఉంది. ప్రస్తుత ఫలితాలను చూస్తే ఈ ఏడాది ఇంటర్ అడ్మిషన్లపై కూడా ప్రభావం పడే ప్రమాదం పొంచి ఉంది. ఇంటర్ విద్యాశాఖ అధికారుల పనితీరును జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో గవర్నమెంట్ జూనియర్ కాలేజీల పరిస్థితి అద్వానంగా మారింది.