సామాజిక సారథి, వైరా: ఖమ్మం జిల్లా వైరాలోని శాంతినగర్ సమీపంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును ఓ అగంతకుడు తెంచుకొని పారిపోయిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దేవభక్తిని లక్ష్మి అనే మహిళ అయ్యప్ప స్వామి ఆలయం వద్ద శబరి కళ్యాణ మండపంలో జరుగుతున్న వివాహానికి వెళ్లేందుకు ప్రధాన రహదారిపై బస్సు దిగి నడుచుకుంటూ మరో ఇద్దరు మహిళలతో కలిసి వెళుతుంది. ఈ సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ అగంతకుడు లక్ష్మీ మెడలోని బంగారు గొలుసును తెంచుకొని పారిపోయాడు. ఈ సంఘటనతో కంగుతిన్న బాధిత మహిళ వెంటనే కొణిజర్ల, వైరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారు గొలుసు రూ.లక్ష ఉంటుందని బాధిత మహిళ లక్ష్మీ తెలిపారు.