– పదేళ్లు గా పాలెం గ్రామాభివృద్దిలో ప్రత్యేక పాత్ర
ప్రభుత్వ స్కీం లను మహిళలకు అందిస్తూ ఉత్తమ సేవలు
– ఉత్తమ సేవలకు గుర్తింపుగా కృష్ణవేణికి ఉత్తమవిశిష్ట సేవాపురస్కారం
– గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అందుకున్న పురస్కారం
సామాజిక సారథి, నాగర్ కర్నూల్:
ఆమె ఓ సాధారణ మహిళ… తన గ్రామంలోనే ఓ చిన్నపాటి చిరుద్యోగి. ప్రతి రోజు నిద్రలేవగానే ఇంటి పనులు, కుటుంభ భాధ్యతలను ఓ వైపు సక్రమంగా నిర్వహిస్తూనే మరొక వైపు తన చిరుద్యోగాన్ని నమ్ముకొని ఆ ఉద్యోగ భాధ్యతలను సైతం ఎలాంటి పక్షపాతం లేకుండా కొనసాగిస్తూనే ఉంది. తన ఉద్యోగ బాధ్యతను ఎంతో ఇష్టంగా తీసుకొని గ్రామాభివృద్దికి తనవంతు సహకారం అందిస్తూనే వస్తోంది. ఉద్యోగిగానే కాకుండా ఓ మహిళగా ప్రభుత్వం నుంచి మహిళలకు ఎలాంటి అభివృద్ది, సంక్షేమ పథకాలు వస్తున్నాయో వాటిని తోటి మహిళలకు అర్థమయ్యేలా చెప్పడమేగాదు.. వాటిని సద్వినియోగం చేసుకొని ఆ మహిళలు సైతం అర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తూనే ఉంది. తన గ్రామాభివృద్దికి గ్రామ సర్పంచ్ , పంచాయతీ కార్యదర్శుల సహకారంతో పాటు ఇతర గ్రామ పెద్దలు, అధికారుల అండతో పదేళ్లుగా కృషి చేస్తూనే ఉంది. దీన్ని గమనించిన అధికారులు, గ్రామ పెద్దలు ఆమె కృషిని గుర్తించి ఉత్తమ విశిష్ట సేవా పురస్కారానికి ఎంపిక చేసి ఆ మహిళా చిరుద్యోగి పై మరింత బాధ్యతలను పెట్టారు.
ఎవరా మహిళ..ఏంటా బాధ్యత….
వివరాల్లోకి వెళితే… నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన గంగు కృష్ణ వేణి గత కొన్నేళ్లుగా ఇదే గ్రామ పంచాయతీ పరిధిలో విఓఏ గా విధులు నిర్వహిస్తున్నారు. చేసే ఉద్యోగం చిన్నపాటిదే అయినా మొక్కవోని ఆమె ఆత్మవిశ్వాసం ఆమెకు మరింత పేరు తెచ్చింది. విఓఏ గా పనిచేస్తున్న గంగు కృష్ణ వేణి గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తో ఇతర అధికారులు, గ్రామ పెద్దల సహకారంతో తన ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ గ్రామాభివృద్దితో పాటు గ్రామంలోని మహిళలకు తోడుగా, అండగా నిలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో ఎంతో మహిళలు నిరంతరం కష్టపడుతున్నా ఆ రెక్కల కష్టం వారికి అండగా నిలవడం కోసం పొదుపు మంత్రాన్ని కృష్ణ వేణి వారికి నేర్పిచింది. ప్రభుత్వం మహిళలకు అందజేస్తున్న రుణాలు, ఇతర అభివృద్ది పథకాలను వారికి అర్థమయ్యే రీతిలో చెప్పి వారి చేసిన రెక్కల కష్టాన్ని వివిధ పథకాల ద్వారా దాచుకొని వారికి ఆపద సమయంలో అండగా ఉంచేలా చేసింది. మహిళలకు ఏఏ ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయో వారికి అవగాహన కల్పించి వారు కూడా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తన వంతు సాయం అందించింది. కొన్నేళ్లుగా కృష్ణ వేణి చేస్తున్న సేవలను అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించి ఉత్తమ విశిష్ట సేవా పురస్కారం అవార్డుకు ఎంపిక చేశారు. దీంతో కృష్ణ వేణి శుక్రవారం గ్రామ సర్పంచ్ , కార్యదర్శులతో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకుంది. తనకు ఈ పురస్కారం రావడానకి కృషి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆమె ప్రత్యేగంగా దన్య వాదాలు చెప్పింది. అంతే కాకుండా అవార్డులు తనకు మరింత బాధ్యతను పెంచిందని తన ఉద్యోగ ధర్మాన్ని ఎప్పటికి మరిచిపోకుండా గ్రామాభివృద్ది కోసం మరింత సేవలందిస్తానని తెలిపింది. చిరుద్యోగి అయినా ఉత్తమ విశిష్ట సేవా పురస్కారానికి ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు, మహిళలు కృష్ణవేణిని ప్రత్యేకంగా అభినందించారు.