Breaking News

‘ఆయిల్‌ పామ్‌’తో లాభాలు

‘ఆయిల్‌ పామ్‌’తో లాభాలు
  • ప్రపంచ వ్యాప్తంగా పంటకు డిమాండ్‌
  • కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్‌
  • హైటెక్స్‌ రెండు రోజుల పాటు జాతీయ సదస్సు

సామాజికసారథి, హైదరాబాద్‌: ఆయిల్‌పామ్‌ సాగుతో మంచి లాభాలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా దీనికి డిమాండ్‌ ఉందన్నారు. సాగుచేసే రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందన్నారు. పరిశ్రమ బలోపేతం, భవిష్యత్‌ కార్యాచరణపై హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మంగళవారం జాతీయ సదస్సు జరిగింది. సదస్సు సహా డ్రాగన్‌ ఫ్రూట్‌ ప్రదర్శనను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, కేరళ మంత్రి ప్రసాద్‌ పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ జాతీయ సదస్సులో ఆయిల్‌పామ్‌ సాగు, భవిష్యత్‌ కార్యాచరణ రూపకల్పనపై జాతీయస్థాయి సంస్థలు, అధికారులు, నిపుణులు చర్చించనున్నారు. దేశంలో ఆయిల్‌పామ్‌ రైతుల సంక్షేమం, పరిశ్రమ బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నేషనల్‌ ఎడిబుల్‌ ఆయిల్‌ మిషన్‌ ఆయిల్‌పామ్‌ పథకం గురించి.. ఈశాన్య రాష్టాల్ల్రో విస్తృత ప్రచారం చేయడానికి ఉద్దేశించి అక్టోబర్​5న గౌహతిలో బిజినెస్‌ సమ్మిట్‌ నిర్వహించింది. హైదరాబాద్‌ వేదికగా ఈ కీలక జాతీయ సదస్సు జరుగుతున్నందున ఆయిల్‌పామ్‌ రైతులకు మంచి రోజులు రానున్నాయని ఉద్యానశాఖ వర్గాలు తెలిపాయి. ఈ సదస్సులో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సహా పలు రాష్టాల్ర మంత్రులు, కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, పలు రాష్ట్రాల కార్యదర్శులు, కమిషనర్లు, ఐసీఏఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ త్రిలోచన్‌ మహాపాత్ర తదితరులు పాల్గొన్నారు. పంట సాగుచేసే 9 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్‌పామ్‌ పంట సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదతక పెంపు, రైతులకు ఇతోధిక రాయితీ, ఇతర ప్రోత్సాహకాలు, ఆదాయం పెంపు, ఆయిల్‌ పరిశ్రమ బలోపేతం, ఈ రంగంలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. పామాయిల్‌ వినియోగంలో ఇండోనేషియా అగ్రస్థానంలో ఉండగా, భారత్‌ రెండో స్థానంలో ఉంది.