సామాజిక సారథి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్, రాజకీయ భీష్ముడిగా పేరొందిన కొణిజేటి రోశయ్య(88) శనివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ పల్స్ పడిపోవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు సతీమణి శివలక్ష్మి, ముగ్గురు సతానం ఉన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఉద్దండులైన నేతగా పేరొందారు. వయస్సు రీత్యా రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో సంచలన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచేవారు. కొణిజేటి రోశయ్య 1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో చదవించారు. కాంగ్రెస్ నుంచి 1968, 1974, 1980లో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. తొలిసారి దివంగత ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదార్లు శాఖ, రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చాలా ముఖ్యమంత్రుల మంత్రివర్గాల్లో పలు కీలకమైన శాఖలు నిర్వహించి ఆ పదవులకు వన్నెతెచ్చారు. 2004-09లో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబర్24 వరకు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు గవర్నర్గా సేవలు అందించారు.
వైఎస్ మరణంతో సీఎం పీఠం
ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. ఇందులో చివరి ఏడుసార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా చెబుతారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009 సెప్టెంబర్ 3న రోశయ్య సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 14 నెలల పాటు అధికారంలో కొనసాగారు. అనంతరం 2010 నవంబర్ 24న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.