Breaking News

ఖమ్మంపై గురి.. 18న బీఆర్ఎస్ సభకు భారీగా ఏర్పాట్లు

• హాజరుకానున్న సీఎంలు కేజీవ్రాల్, పినరయి విజయన్, భగవంత్మాన్

• పార్టీ ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ సమాలోచనలు

• పొంగులేటి, తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటనలతో మరింత అలర్ట్ సత్తాచాటాలని చూస్తున్న బీఆర్ఎస్ నేతలు

సామాజికసారథి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఖమ్మం జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తెలుగు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న జిల్లాపై సీఎం కేసీఆర్ మళ్లీ గురిపెట్టారు. అందుకే వ్యూహాత్మకంగా ఈనెల 18న ఇక్కడ బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరపాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం జిల్లా రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మరింత దృష్టిసారిం చారు. జిల్లాలో ఇటీవల ఆత్మీయ సమావేశాలు, సభలు జోరందుకోవడం, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని వార్తలు రావడం, వచ్చే ఎన్నికల్లో తన అనుచరులు పది నియోజకవర్గాల్లో పోటీలో ఉంటారని ప్రకటన చేయడంతో బీఆర్ఎస్ నాయకత్వం అందుకు తగినట్లుగా వ్యూహరచన చేస్తోంది. గత ఎన్నికల పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తగిన కార్యాచరణతో దిగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, రవిచంద్ర, పార్థసారథి, ఎమ్మెల్యేలు హరిప్రియ, సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, ఎమ్మెల్సీ మధు, జడ్పీ చైర్మన్ కమల్రాజ్ భేటీలో పాల్గొన్నారు. ఈ నెల 18న ఖమ్మంలో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సభ ఏర్పాట్లపై ఖమ్మం జిల్లా నేతలతో సీఎం చర్చించారు. పార్టీ ఆవిర్భావం అనంతరం తొలిసారిగా నిర్వహిస్తున్న సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజీవ్రాల్, పంజాబ్ సీఎం భగవంత్మాన్, కేరళ సీఎం పినరాయి విజయన్, యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్తో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యే అవకాశం ఉన్నది.

జాతీయ రాజకీయా ల్లోకి వెళ్లేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం కోరిన సీఎం కేసీఆర్, ఈ సభ ద్వారా దేశ రైతాంగా నికి, రాజకీయ పక్షాలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. బీఆర్ఎస్ ద్వారా దేశ వ్యవసాయరంగంలో తీసుకొచ్చే మార్పులపై వివరించనున్నట్లు సమాచారం. శ్రీనివాస్ రెడ్డి మార్క్ గత ఎన్నికల్లో పొంగులేటి టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి తెరవెనుక ప్రయత్నాలు చేశారని, వైరా నియోజకవర్గంలో కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థి మదన్లాల్్కు వ్యతిరేకంగా రాములునాయకన్ను స్వతంత్రంగా బరిలోకి దించి ఆయనను గెలిపించ డంలో శ్రీనివాస్ రెడ్డి తెరవెనుక పాత్ర పోషించారన్న ప్రచారం ఉంది. ఆ తర్వాత రాములునాయకన్ను తీసుకెళ్లి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేర్పించారు. అయితే పొంగులేటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయనకు లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలే దన్న చర్చ జరిగింది. చివరకు టీడీపీలో ఉన్న నామా నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకుని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు.

ఆ ఎన్నికల్లో ఆయన గెలు పొందడం, ఆ వెంటనే లోక్సభా పక్షనేతగా ఎన్నిక కావడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామా లను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ మళ్లీ ఖమ్మం జిల్లా రాజకీయాన్ని తన కనుసన్నల్లో నడిపించేందుకు యత్నిస్తున్నారు. పరిస్థితిని గమనించి ఈసారి కూడా టికెట్ రాదని భావించి మాజీ ఎంపీ పొంగులేటి తన అనుచరులతో బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధంచేసుకోవడంతో జిల్లాలో పార్టీ నష్టపోకుండా ఉండేందుకు ముందుచూపుతో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయించారు. నేతల హాట్ కామెంట్స్ ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ సభ నిర్వ హించేందుకు సమాయత్తమైంది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో భేటీఅయ్యారు. అయితే ఈ సమావేశానికి కొత్తగూడెం, పాలేరు ఎమ్మెల్యే లు వనమా వెంకటే శ్వర రావు, కందా ఉపేందర్ రెడ్డి డుమ్మాకొట్టారు. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ మీటింగ్ కు హాజరుకాలేదు. ఈ క్రమంలో పార్టీలో ఉండేదె వరు? పోయేదేవరన్న చర్చ జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. కొంతకాలంగా పార్టీపై తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పొంగులేటి గత కొన్ని రోజులుగా చేస్తున్న కామెంట్స్ చూస్తే ఆయన పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

అటు తుమ్మల కూడా తాను పాలేరు నుంచి పోటీచే స్తానని ఇప్పటికే ప్రకటించారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం సిట్టింగ్ లకే టికెట్లు ఇస్తామని ప్రకటిం చారు. ఆ క్రమంలో తుమ్మల కూడా పార్టీ మారుతా రన్న ప్రచారం జోరందుకుంది. వారిద్దరూ బీజేపీలో చేరనున్నారన్న ఊహాగానాలు సైతం వినిపిస్తు న్నాయి. అయితే ఖమ్మం జిల్లా రాజకీయ చిత్రం ఎలా మారనుందన్న అంశంపై క్లారిటీ రావాలంటే ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభ వరకు వేచి చూడాల్సిందే.