- సీఎం కేసీఆర్ ఉగాది పురస్కారంలో గుర్తింపునిచ్చారు
- కిన్నెరమెట్ల కళ నాతోనే ముగియకుండా నేర్పిస్తా
- ప్రభుత్వం కొంత భూమి ఇచ్చి ఆదుకోవాలి
- కిన్నెరమెట్ల ప్రముఖ కళాకారుడు మొగులయ్య
సామాజిక సారథి, అచ్చంపేట: ‘సీఎం కేసీఆర్ నాకు గుర్తింపు ఇచ్చిండు. ప్రభుత్వం ఇచ్చే రూ.10వేల పింఛన్, నా కుటుంబానికి ఆధారమని 12 మెట్ల కిన్నెర ప్రముఖ వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య తెలిపారు. సినిమా నటుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లానాయక్’ సినిమాలో పాట పాడే అరుదైన అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు తన కిన్నెరతో అచ్చంపేట, లింగాల, తెల్కపల్లి, నాగర్ కర్నూల్, పెద్దకొత్తపల్లి తదితర సంతల్లో పాటలు పాడుకుంటూ జీవనం సాగించే వాడినని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో కళలు, కళాకారులకు గుర్తింపు దక్కిందన్నారు.
గతంలో తాను పోల్కి చెట్లు నరికి తెడ్లు, పప్పు గుత్తిలు, రొట్టె పీటలు తయారుచేసి తన కుటుంబాన్ని పోషించుకునే వాడినని తెలిపారు. తనకు సీఎం కేసీఆర్ ఉగాది పురస్కారం ఇచ్చి సత్కరించడంతో పాటు 8వ తరగతి సాంఘికశాస్త్రం పుస్తకంలో తన కళ, ఫొటోను ముద్రించి గౌరవించారని సంతోషంగా చెప్పారు. రంగయ్య అనే రచయిత తన కళపై పాట రాసి పలు వేదికలపై పరిచయం చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణచారి, మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాల్రాజు తదితరుల సహకారంతో తనకు కళాకారుల పెన్షన్ మంజూరైందని సంతోషం వ్యక్తంచేశారు. కిన్నెరమెట్ల కళ తనతోనే ముగియకుండా పదిమందికి నేర్పించాలనే తపనతో ఉన్నానని, దీనికి ప్రభుత్వం కొంత భూమి ఇచ్చి ఒక ఆఫీసు కట్టించి తన కళను బతికించాలని సీఎం కేసీఆర్ ను కోరారు.