Breaking News

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

సామాజిక సారథి, కౌడిపల్లి: అప్పుల బాధతో ఓ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచన్ పల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచన్ పల్లి గ్రామానికి చెందిన దుంపల మల్లేశం(40) తనకున్న 30 గుంటల వ్యవసాయ పొలంలో వరి సాగుచేస్తున్నాడు. కాగా, వ్యావసాయానికి, తన కుమార్తె వివాహంకోసం రూ.4లక్షల వరకూ అప్పు చేశాడు. అప్పలు ఎలా తీర్చాలో తెలియక మల్లేశం తీవ్ర మనోవేదనకు గురవుతూ వస్తున్నాడు. కాగా, మల్లేశం అల్లుడు శేఖర్, తండ్రి రాములుతో ఫోన్లో మాట్లాడుతూ చేసిన అప్పులు తీర్చలేకపోతున్నానని, అప్పులబాధ ఎక్కువైందని అందుకే ఉరివేసుకుంటున్నట్లు వారికి చెప్పాడు. వెంటనే వారు గ్రామ శివారులోకి వెళ్లి చూడగాఅప్పటికే మల్లేశం ఉరేసుకుని వేలాడుతూ  కనిపించాడు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉండగా, ఒకరికి వివాహమైంది. అందులో ఒకరు దివ్యాంగురాలు కావడం, ఇద్దరి ఆడపిల్లను మృతుడి భార్య ఎలా పోషిస్తుందోనని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. మల్లేశం భార్య సుగుణ ఫిర్యాదుతో ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.