Breaking News

వనపర్తిలో ఫేక్ సర్టిఫికెట్ల కలకలం

  • May 19, 2023
  • Archive
  • Top News
  • Comments Off on వనపర్తిలో ఫేక్ సర్టిఫికెట్ల కలకలం
వనపర్తిలో ఫేక్ సర్టిఫికెట్ల కలకలం
  • రెగ్యులరైజేషన్ కోసం కాంట్రాక్ట్ లెక్చరర్ల అడ్డదారులు
  • గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో నయా దందా
  • డీఐఈఓ కు ఫిర్యాదు చేసినా నో ఎంక్వైరీ
  • కాంట్రాక్ట్ లెక్చరర్లకు సహకరిస్తున్న డీఐఈవో, ప్రిన్సిపాళ్లు

సామాజికసారథి, వనపర్తి బ్యూరో: వనపర్తి జిల్లా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఫేక్ సర్టిఫికెట్లు కలకలం రేపుతోంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కొందరు కాంట్రాక్ట్ లెక్చరర్లు రెగ్యులరైజేషన్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజేషన్ చేయడంతో కొందరు లెక్చరర్లు చేస్తున్న మాయజాలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లాలో ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఇంటర్ బోర్డును మోసం చేస్తున్నారని స్టూడెంట్ యూనియన్ నాయకులు వనపర్తి డీఐఈవో జాకీర్ హుస్సేన్ కు ఫిర్యాదుచేసి నెల రోజులు కావస్తున్నా నేటికి ఎలాంటి ఎంక్వైరీ చేయడం లేదు. అడ్డదారులు తొక్కుతున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు డీఐఈవో జాకీర్ హుస్సేన్ ఆయా జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్​ అండగా ఉంటున్నారనేందుకు ఎంక్వైరీ చేయకుండా జాప్యం చేస్తుండటమే నిదర్శనంగా చెప్పవచ్చు. పైగా కాంట్రాక్ట్ లెక్చరర్ల పై వస్తున్న ఫిర్యాదులను తొక్కి పట్టేందుకు, వారికి అనుకూలంగా ఇంటర్మీడియట్​ బోర్డుకు నివేదిక ఇచ్చేందుకు డీఐఈవో, ప్రిన్సిపాళ్లు భారీగా కమీషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


డీఐఈవోకు ఫిర్యాదుతో వెలుగులోకి..
వనపర్తిలో మొత్తం 14 మండలాలు ఉండగా 12 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో సుమారు 80మంది కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. వారిలో పెద్దమందడి జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్( కెమిస్ట్రీ), గోపాల్ పేట జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న నాగిళ్ల రాములు (జువాలజీ)లపై గ్రాడ్యుయేషన్ అసోషియేషన్ కార్యదర్శి ఎన్.భరత్ ఈనెల 2న వనపర్తి డీఐఈవో జాకీర్ హుస్సేన్ కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదుచేశారు. గోపాల్ పేటలో పనిచేస్తున్న నాగిళ్ల రాములు మహరాష్ట్రలోని మరథ్వాడా యూనివర్శిటీ (ప్రస్తుతం డా.బాబాసాహెబ్ అంబేద్కర్ మరఠ్వాడా యూనివర్శిటీ, ఔరంగాబాద్) లో ఎమ్మెస్సీ జువాలజీ కోర్సు చేసినట్లు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టాడని డీఐఈవోకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటు పెద్దమందడి జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ పీజీ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు చేయకుండానే రెండు సంవత్సరాలకు పైగా ఇంటర్ బోర్డులో పరిధిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేశాడని డీఐఈవోకు వివరించారు. పైగా ప్రవీణ్ కుమార్ పెద్దమందడి జూనియర్ కాలేజీలోనే తన ఫస్ట్ అపాయింట్ మెంట్ అని తేది 01.07.2005 నుంచి ఇప్పటి వరకు కెమిస్ట్రీ జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్నట్లు, మహారాష్ట్రలోని స్వామీ రామానంద్ తీర్థ్ మరథ్వాడ్ యూనియవర్శిటీలో 2004 లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసినట్లు తప్పుడు వివరాలు ఇంటర్ బోర్డు కు ఇచ్చారని ఆరోపించారు. ప్రవీణ్ కుమార్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ సర్టిఫికెట్ లేకుండానే గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో పనిచేసిన విషయాన్ని దాచిపెట్టారని ఈ విషయం పై విచారణ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటు ఇదివరకు కొత్తకోట జూనియర్ కాలేజీలో పనిచేసిన కాంట్రాక్ట్ లెక్చరర్ రవీందర్ రెడ్డి కూడా ఫేక్ పీజీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లు ఫిర్యాదులు రావడంతో ఇంటర్ విద్యాశాఖ ఆర్జేడీ విచారణ చేసినా ఆ విషయాన్ని ఇప్పటికి కప్పిపుచ్చుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు వనపర్తి జిల్లాలోని పాన్ గల్ జూనియర్ కాలేజీతో పాటు మరికొన్ని మండలాల్లో కూడా కొందరు కాంట్రాక్టు లెక్చరర్లు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇటీవల కాంట్రాక్ట్ లెక్చరర్లను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


నెలరోజులు కావస్తున్నా నో ఎంక్వైరీ
వనపర్తి జిల్లాలో రెగ్యులరైజేషన్ కోసం కొందరు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఫేక్ సర్టిఫికెట్లతో అడ్డదారులు తొక్కుతున్నట్లు డీఐఈఓ కు ఫిర్యాదు చేసిన నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఎంక్వైరీ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులైజేషన్ లో ఇంటర్ బోర్డు లెక్చరర్ల సర్టిఫికెట్లను ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు క్షుణ్ణంగా పరిశీలించి ఇంటర్ బోర్డు ఇచ్చిన చెక్ లీస్ట్ ఆధారంగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తమ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు ఎప్పటి నుంచి ఇంటర్ బోర్డు పరిధిలో పనిచేస్తున్నారో, ఏయే కాలేజీల్లో పనిచేస్తున్నారో, వారి ఫస్ట్ ఆపాయ్ మెంట్ నాటికి పీజీ కోర్సు పూర్తి చేశారా.. ఆ యూనివర్శిటీకి యూజీసీ గుర్తింపు ఉందా తదితర అంశాలను పరిశీలించి డీఐఈవోకు అందజేయాల్సీ ఉంటుంది. ప్రిన్సిపాళ్ల నుంచి వచ్చిన పూర్తి సమాచారాన్ని డీఐఈవోలు సైతం పూర్తిస్థాయిలో పరిశీలించి ఇంటర్ బోర్డుకు పంపించాల్సీ ఉంటుంది. డీఐఈవోలు బోర్డుకు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంటర్ బోర్డు అధికారులు వారిని రెగ్యులరైజేషన్ జాబితాలో చేర్చడం సరైన వివరాలు లేకుంటే వారిని ఆ జాబితాలోంచి తీసేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ తప్పులను కప్పిపుచ్చి ఇంటర్ బోర్డుకు అవసరమైన విధంగా చెక్ లీస్ట్ లో మార్పులు చేర్పులు చేసి పంపుతున్నారు. దీనికోసం ఆయా కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీఐఈఓ లకు భారీగా ముడుపులు అందజేసి తమ రెగ్యులరైజేషన్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటర్ బోర్డుకు తమ వివరాలు పంపించుకుంటున్నట్లు తెలుస్తోంది. వనపర్తి జిల్లాలో కాంట్రాక్ట్ లెక్చరర్ల పూర్తి వివరాలు డీఐఈవో, ప్రిన్సిపాళ్ల వద్ద ఉన్నా తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని బుకాయిస్తున్నారు. ఎలాంటి ఫేక్ సర్టిఫికెట్లు కాని, ఎలాంటి తప్పులు కాని లేకుంటే ఆరోపణలు వచ్చిన కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్టిఫికెట్లను మీడియాకు అందజేసి సమస్యను పరిష్కారించాల్సీన డీఐఈవో సైతం నిర్లక్ష్యంగా ఉండడం పై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
ఫిర్యాదు చేసినా ఎంక్వైరీ లేదు

వనపర్తి జిల్లాలో కొందరు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారన్న విషయంపై డీఐఈవోకు ఫిర్యాదుచేసి నెల రోజులు కావస్తోంది. ఆరోపణలు వచ్చిన కాంట్రాక్ట్ లెక్చరర్లతో డీఐఈవో, ప్రిన్సిపాళ్లు కుమ్మక్కు ఎలాంటి విచారణ చేయడం లేదు. ఫేక్ సర్టిఫికెట్లు, తప్పుడు పనులు చేసిన వారికి అనుకూలంగా రిపోర్టులు మార్చి ఇంటర్ బోర్డుకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఎలాంటి తప్పులు జరుగకపోతే మీడియా సమావేశం పెట్టి ఆరోపణలు నిజం కాదని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఇంటర్ విద్యాశాఖ అధికారులపై ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలి.

:: ఎన్.భరత్, గ్రాడ్యుయేషన్ అసోషియేషన్ కార్యదర్శి