Breaking News

రైతులకు సేవలందించడంలో విఫలం

రైతులకు సేవలందించడంలో విఫలం

సామాజిక సారథి‌, వైరా: ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు, సేవలందించడంలో ఉద్యానవన శాఖ విఫలమైందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు ఆరోపించారు. వైరా మండలంలోని పలు గ్రామాల్లో రైతు సంఘం బృందం వైరస్ సోకిన మిర్చి తోటలను గురువారం పరిశీలించింది. పలువురు రైతులు వైరస్ తో దెబ్బతిన్న మిర్చి తోటలను ఈ బృందానికి చూపించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ మిర్చి సాగులో 50శాతం మంది కౌలు రైతులు ఉన్నారని, ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.35 వేలు కౌలు సొమ్మును ముందుగానే భూ యజమానులకు చెల్లించారని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.80 వేలకు పైగా పెట్టుబడులు పెట్టారని ఈ పరిస్థితుల్లో వైరస్ సోకి మిర్చి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్ తో వందలాది ఎకరాల విస్తీర్ణంలోని మిర్చి తోటలను రైతులు తొలగిస్తున్నారని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో  సీపీఎం మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, రైతులు ఎక్కిరాల కోటేశ్వరరావు, సైదులు, నారాయణ, ఆవుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.