- ‘సామాజికసారథి’ కథనంపై ఉలిక్కిపాటు
- నిజనిర్ధారణ కమిటీ వేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని కారుకొండ గ్రామంలో ఓ పేద కుటుంబంపై అరాచకం సాగిస్తున్న టీఆర్ఎస్ నాయకుడు, సర్పంచ్మిద్దె శ్రీశైలం తండ్రి బాలస్వామిని పార్టీ నుంచి బహిష్కరించారు. కొడుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గ్రామంలో అరాచకాలు సాగిస్తున్నాడు. ఈ విషయమై గతంలో ‘సామాజికసారథి’లో ‘కారుకొండలో కీచకుడు’ శీర్షికన కథనం కూడా వెలువడింది. తాజాగా శనివారం ‘వివాహితపై కన్నేసి.. డబ్బును కాజేసి’ శీర్షికన బాధితురాలి కన్నీటిగాథను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ విషయం నాగర్కర్నూల్ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి దృష్టికి కూడా వెళ్లడంతో ఆయన విచారణకు ఆదేశించారు. కారుకొండలో విచారణ జరిపేందుకు ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగి విజయ్ నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీని నియమించారు. మిద్దె బాలస్వామి అరాచకాలు వాస్తవమేనని, టీఆర్ఎస్ నుంచి అతని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని వారు ప్రకటించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించిన వారిలో మార్కెట్ కమిటీ చైర్మన్ కురుమయ్య, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి , టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులేందర్ రెడ్డి, నాయకులు రాము నాయక్ , శేఖర్ రావు ఉన్నారు.
ఏం జరిగిందంటే..
కారుకొండ గ్రామానికి చెందిన మెట్ట వెంకట్రాములు భార్య మెట్ట గౌరమ్మ పేర ఐదెకరాల పొలం ఉంది. వారికి ట్రాక్టర్కూడా ఉంది. సొంత పొలం పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్‌లో పోవడంతో ప్రభుత్వం నుంచి రూ.22లక్షల పరిహారం వచ్చింది. మిద్దె బాలస్వామి.. గౌరమ్మ భార్యాభర్తలను తన వద్ద పనికి కుదుర్చుకున్నాడు. వెంకట్రాములు బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.18లక్షలను పలు సందర్భాల్లో బాలస్వామి తన బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ‘మీ పేర పొలం కొంటానని’ చెప్పి నమ్మించాడు. డబ్బును తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో వెంకట్రాములును భయపెట్టి గౌరమ్మను లొంగదీసుకున్నాడు. పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ట్రాక్టర్‌ను కూడా బలవంతంగా తెచ్చుకున్నాడు. తమకు జరుగుతున్న అన్యాయంపై బాధిత భార్యాభర్తలు బిజినేపల్లి పోలీసులను ఆశ్రయించినా కేసు కూడా నమోదు చేయలేదు. కొడుకు అసలే సర్పంచ్.. ఊరిలో అసలు విషయం తెలుస్తుందని భావించి బిజినేపల్లిలో రూమ్పెట్టి గౌరమ్మను రెండునెలల పాటు నిర్బంధించాడు. బాలస్వామి కుటుంబానికి భయపడిన వెంకట్రాములు ఊరును విడిచాడు. చివరికి చేసేది భార్యాభర్తలు హైదరాబాద్‌లో తలదాచుకుని మీడియా ఎదుట తమ కన్నీటి గాథను వెళ్లబోసుకున్నారు. న్యాయం చేస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు భరోసా ఇవ్వడంతో బాధితురాలు గౌరమ్మ, వెంకట్రాములు ‘సామాజికసారథి’కి కృతజ్ఞతలు తెలిపారు.
చిలుక ప్రవీణ్ అన్న చెప్పడం ద్వారా నేర్చుకున్నాను