Breaking News

న్యాయవ్యవస్థపై మితిమీరిన జోక్యం సరికాదు

న్యాయవ్యవస్థలో మితిమీరిన జోక్యం సరికాదు

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సామాజికసారథి, పెద్దపల్లి: దేశన్యాయవ్యవస్థలో కేంద్రప్రభుత్వ జోక్యం మితిమీరిపోతున్నదని, న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రమాదంలో పడేసి రాజకీయాలు చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. న్యాయవ్యవస్థ దేశంలో స్వతంత్రత గల రాజ్యాంగబద్ధ సంస్థ అని, కానీ కేంద్రం ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థను సవాల్ చేస్తూ, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. దేశంలో ఈడీ, సీబీఐ, మీడియా సంస్థలవలే న్యాయవ్యవస్థను కూడా తన చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని చూస్తుందని విమర్శించారు. కేంద్రం విపరీతజ్యోక్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన బహుజన రాజ్యాధికారయాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల పేదల భూములు కబ్జాచేసిందని, మళ్లీ ఇప్పుడు ముస్లింలకు చెందిన భూములను దోచుకుంటుందని తెలిపారు. వక్ఫ్ భూములతో రూ.లక్షల కోట్ల ఆదాయం వస్తుందని, దీంతో ముస్లింల జీవితాల్లో పేదరికం లేకుండా చేయొచ్చన్నారు. కానీ కేవలం ధనికులే వక్ఫ్ భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. వక్ఫ్ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

చిన్నారిని ఎత్తుకుని లాలిస్తున్న బీఎస్పీ స్టేట్​ చీఫ్​ డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​

పెద్దపల్లి ఎమ్మెల్యే దోపిడీ ఆపాలి
పెద్దపల్లి జిల్లాలో వెయ్యి ఎకరాల భూమి అన్యాక్రాంతానికి గురైందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల నిర్మాణం కోసం పర్యావరణ అనుమతి తీసుకోకుండా ఎలా ప్రారంభించారని మండిపడ్డారు. రూ.900 కోట్ల జరిమానా ఎలా కడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు పెరిగాయన్నారు. కొండపోచమ్మగుట్ట, చింతలగుట్ట క్వారీలో అక్రమ తవ్వకాలు జరిపి రాత్రికిరాత్రే మట్టి తరలిస్తున్నారని ఆరోపించారు. అనుమతి తీసుకోకుండా గ్రామసభలు కూడా రద్దు చేస్తున్నారని, ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే ఆగడాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. కుర్మపల్లిలో గంగిరెద్దుల ప్రజలకు కనీస వసతులు కల్పించలేదని, కనీసం వారిని కాలనీని కూడా ఎమ్మెల్యే సందర్శించలేదని విమర్శించారు. రాఘవపూర్ గ్రామంలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే పెద్దపల్లి కేంద్రంగా ‘నీ అంతు చూస్తామని’ హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి హనుమయ్య, నియోజకవర్గ ఇంచార్జ్​దాసరి ఉష, జిల్లా ఇంచార్జ్​శేఖర్, జిల్లా అధ్యక్షుడు దుర్గయ్య, మహిళా నాయకురాలు స్వప్నగౌడ్, సుమతి, గొట్టె రాజు, సమ్మయ్య పాల్గొన్నారు.