Breaking News

జోరుగా సాగిన ఏరువాక

జోరుగా ఏరువాక

సారథి, పెద్దశంకరంపేట/రామాయంపేట: ఏరువాక గురువారం జోరుగా సాగింది. పౌర్ణమి సందర్భంగా రైతులు ఎడ్లబండ్లు, నాగళ్లను మువ్వలు, వివిధ అలంకరణలు చేసి పొలం బాటపట్టారు. పెద్దశంకరంపేట, రామాయంపేట మండలాల్లో రైతన్నలు ఉత్సాహంగా నిర్వహించారు. వ్యవసాయ పనులను ప్రారంభించడానికి ముందు భూమికి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ శుభదినాన రైతులు, అన్నదాతలకు సిరులపంట పండుతుందని విశ్వాసం. జ్యేష్ఠ శుద్ధపౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని పిలుస్తుంటారు. పండుగ రోజున ఎద్దులను కడిగి వాటి కొమ్ములకు అందమైన రంగులు పూసి, మెడలో కొత్త గంటలు, రంగురంగుల పూసలు, పూలతో నిండిన దిష్టితాళ్లతో అలంకరిస్తారు. వాటి కాళ్లకు గజ్జెలు కట్టి.. నాగలి కాడికి కూడా రంగులు రుద్దారు. ఎద్దులను కట్టేసే పశువుల పాకను పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు చేసి, ధూపదీప నైవేధ్యాలు సమర్పించారు. మరీ ముఖ్యంగా పండుగ రోజున పొంగలి వండి ఎద్దులకు తినిపించారు. రైతులు ఉదయం పూజా కార్యక్రమాలు ముగిశాక సాయంత్రం రైతన్నలు నాగలిని భుజం మీద పెట్టుకొని ఎద్దులను తొలుకుని పొలాలకు వెళ్లి అక్కడ భూమిని పూజించి, దున్నడం ప్రారంభించారు.

రామాయంపేట: ఏరువాక సందర్భంగా పొలంలో విత్తనాలు వేస్తున్న రైతులు