Breaking News

5 రాష్ట్రాల్లో ఎన్నికల సంగ్రామం

5 రాష్ట్రాల్లో ఎన్నికల సంగ్రామం

న్యూఢిల్లీ: మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. అస్సాం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా శుక్రవారం వెలువరించారు. కేరళలో 140, అస్సాం 126, తమిళనాడు 234, పశ్చిమబెంగాల్‌ 294, పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 16 రాష్ట్రాల్లో 34 స్థానాలకు ఉపఎన్నికలకు కూడా షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి కూడా షెడ్యూల్‌ విడుదల చేశారు. ఎన్నికల ఫలితాలు మే 2న ప్రకటించనున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లోని 824 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మొత్తం ఓటర్లు 18.68 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 2.70 లక్షల పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు.

వివరాలు వెల్లడిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా

అస్సాం: 47 అసెంబ్లీ స్థానాలు
–మూడు విడతల్లో 126 స్థానాలకు ఎన్నికలు
– మార్చి 27న తొలి విడత పోలింగ్‌
– ఏప్రిల్‌ 1, 6వ తేదీల్లో రెండు, మూడో విడత ఎన్నికలు
– 33వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు.
తమిళనాడు: 234 అసెంబ్లీ స్థానాలు
– ఏప్రిల్‌ 6వ తేదీన పోలింగ్‌ జరగనుంది.
–89 వేల పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు
కేరళ: 140 అసెంబ్లీ స్థానాలు
– ఏప్రిల్ ‌6వ తేదీన ఎన్నిక జరగనుంది.
– 40వేల పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌
పశ్చిమబెంగాల్: 294 అసెంబ్లీ స్థానాలు
– మొత్తం 8 విడతల్లో ఎన్నికలు
– మార్చి 27, ఏప్రిల్‌ 1, 6, 10, 17, 22, 26, 29 తేదీల్లో పోలింగ్,
– 8 విడతల్లో జరిగే ఈ ఎన్నికలకు లక్షకు పైగా పోలింగ్‌ కేంద్రాలు
పుదుచ్చేరి: 30 అసెంబ్లీ స్థానాలు
– కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్‌
– ఏప్రిల్‌ 6వ తేదీన పోలింగ్‌
– 1,500 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు