- ఎమ్మెల్యే సొంత మండలంలోనే అంబులెన్స్ సౌకర్యం లేదు
- బహుజన రాజ్యంలో విద్యా, వైద్యానికి తొలి ప్రాధాన్యం
- బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్
సామాజికసారథి, తిమ్మాజిపేట: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో మంగళవారం తిమ్మాజిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సొంత మండలమైన తిమ్మాజిపేటలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటన్నారు. 30 ఏళ్ల క్రితం కట్టిన ప్రభుత్వ ఆస్పత్రి బిల్డింగ్ శిథిలావస్థకు చేరిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు డ్యూటీ డాక్టర్లు ఉండాల్సిన చోటా కేవలం ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. సరైన ఆటస్థలం, నీటి సమస్య, కిటికీలు, తలుపులు లేకుండా ఉండటం, డే వాచ్ మెన్ పోస్ట్ ఖాళీగా ఉండటం, సీసీ కెమెరాల సమస్య ఇలా అనేక సమస్యలతో, కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయం సమస్యలకు నిలయంగా మారిందని వివరించారు. స్కూలు ఆవరణలో మొర్రం పోయిస్తే నీళ్లు నిల్వకుండా ఉంటాయని తెలిపారు. రానున్న బహుజన రాజ్యంలో విద్యా, వైద్యానికి తొలి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వైఫల్యాలను నియోజకవర్గంలోని ప్రతి ఓటరుకు తెలియజేసి దోపిడీ పాలనను కూల్చి బహుజన రాజ్యం సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ అధ్యక్షుడు బండి పృథ్వీరాజ్, ప్రధాన కార్యదర్శి శ్రీనువాసులు, ఉపాధ్యక్షుడు పరుశరాం, బీఎస్పీ తిమ్మాజిపేట మండల కన్వీనర్లు బి.రాజ్, శంకర్, నాయకులు సత్యం, రమేష్, కృష్ణ, అశోక్, మొగులాల్, బాలనాగులు, రాజ్, సాయికుమార్, జగదీశ్, మల్లేష్, మహేష్, కురుమయ్య, సోషల్ మీడియా కన్వీనర్ రామ్, బీవీఫ్ జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య పాల్గొన్నారు.