సారథి, హుస్నాబాద్: రైతులు ఆరుగాలం కష్టపడి సాగుచేసిన వరి పంటలు నీరు లేక ఎండుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిద్దిపేట సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతులతో కలిసి సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. వానాకాలంలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోగా అన్నదాతలు ఆనందంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో వరి పంటలు వేశారని చెప్పారు. పంటలన్నీ పొట్టదశలో ఉన్నాయని, భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ఎండిపోతున్నాయని వివరించారు.
రైతు రాజ్యమని గొప్పలు చెప్పుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గానికి వరప్రదాయిని అయిర గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు పనులను ప్రభుత్వం పూర్తి చేయకుండా కమీషన్ల కోసం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎండిన పంటలకు ఎకరాకు రూ.50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో రైతులతో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శంకర్, సహాయ కార్యదర్శి రాజ్ కుమార్, నియోజకవర్గంలోని పలు మండలాల కార్యదర్శులు వనేశ్, కె.భాస్కర్, కొమురయ్య, సుదర్శన్, శ్రీధర్, రైతులు పాల్గొన్నారు.