- రాష్ట్రానికి స్పష్టం చేసిన కేంద్రం
- వడ్ల కొనుగోళ్లపై స్పష్టత కరువు
- నిరాశ కలిగించిందన్న మంత్రి నిరంజన్‌రెడ్డి
న్యూఢిల్లీ: తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఆహార శాఖమంత్రి పీయూష్ గోయల్‌ను రాష్ట్ర మంత్రుల బృందం కోరింది. ఈ విషయంపై శుక్రవారం గోయల్‌తో మంత్రుల బృందం గంటపాటు సమాలోచనలు జరిపింది. రెండు సీజనల్లో ధాన్యం సేకరించాలని రాష్ట్ర మంత్రులు కోరారు. అయితే, గోయల్ నుంచి ఇప్పుడు కూడా స్పష్టమైన ప్రకటన రాలేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. పీయూష్ గోయల్‌తో జరిగిన సమావేశం తమను నిరాశపరిచిందని పేర్కొన్నారు. 80.85లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తామని గత సమావేశంలో చెప్పారని, ఇప్పుడేమో ఏడాది టార్గెట్ ఇప్పుడే ఎలా చెబుతామని దాటవేసే ధోరణిలో మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. ఓ వైపు కొనుగోళ్లు జరుగుతుంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటారో చెప్పలేని దయనీయ స్థితిలో కేంద్రం ఉండటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం తెలంగాణకు లేఖ ఇచ్చిందని, దాన్ని పెంచమని కోరామని తెలిపారు. ఆ విషయం ఈ రోజు చెబుతారునుకున్నామని, ఏడాది టార్గెట్ ఇస్తారనుకున్నామని, ఈ రెండూ చెప్పకుండా యాసంగిలో వరి వేయొద్దని మాత్రం గట్టిగా చెప్పారని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
ఎలాంటి హామీ ఇవ్వలేదు
వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో చర్చించేందుకు ఇటీవలే సీఎం కేసీఆర్, మంత్రివర్గ బృందం ఢిల్లీకి వెళ్లింది. కానీ ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఈ క్రమంలో కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు భేటీ అయ్యారు. ‘మేము చాలా ఆశతో ఈ సమావేశానికి వచ్చాం, కేంద్రం నిరాశే మిగిల్చింది. సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాలేదు. గత వారం కూడా కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదు.’ అని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.