- ఇచ్చిన మాటపై నిలబడకుంటే
- మరోసారి ఉద్యమం తప్పదు
- జనవరి 15న సంయుక్త కిసాన్ మోర్చా భేటీ
- రైతునేత రాకేశ్ టికాయత్ వెల్లడి
న్యూఢిల్లీ: రైతులంతా ఇక తమ వ్యవసాయ పనులపై దృష్టి నిలపాలని రైతునేత రాకేశ్ టికాయత్ పిలుపునిచ్చారు. శాంతియుతంగా ఉంటూ అందరూ తమ తమ పనుల్లో మునిగిపోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో నిరసన చేస్తున్న రైతులందరూ ఇంటిబాట పట్టారు. అందులో భాగంగా ఘాజీపూర్ సరిహద్దుల్లో శిబిరాలను ఏర్పర్చుకున్న రైతులు ఆ స్థలాన్ని ఖాళీచేసి తమ ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ సందర్భంగా టికాయత్ శనివారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో తమకు ఏ గొడవ లేదని స్పష్టం చేశారు. అయితే, ఇచ్చిన మాటపై నిలబడకుంటే మాత్రం మరోసారి ఉద్యమం చేపట్టడం మాత్రం ఖాయమని, అందులో అనుమానాలే లేవని టికాయత్ తేల్చిచెప్పారు. జనవరి 15న సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం జరగనుందని, ఈ లోపు హర్యానా ముఖ్యమంత్రితో సహా మరికొంత మంది ముఖ్యమంత్రులతో భేటీ అవుతామని ప్రకటించారు. అయితే యూపీ ఎన్నికల్లో ఎలాంటి విధానాన్ని అవలంభించాలన్న విషయంపై మాత్రం ఇతరులతోనూ చర్చిస్తామని టికాయత్ పేర్కొన్నారు.