Breaking News

అభాగ్యులకు చేయూత

అభాగ్యులకు చేయూత
  • అనాథల రక్షణకు ప్రభుత్వ కార్యాచరణ
  • కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీగా చదువులు
  • ఉన్నతంగా ఎదిగేలా చట్టబద్ధమైన రక్షణ
  • ప్రభుత్వ బిడ్డలుగా గుర్తిస్తూ ఐడీ కార్డులు
  • సీఎం కేసీఆర్‌కు కేబినెట్‌ సబ్‌కమిటీ ప్రతిపాదనలు

సామాజికసారథి, హైదరాబాద్‌: అభాగ్యులను చేరదీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అద్భుత విధానం తీసుకురావడానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో అనాథలను అక్కున చేర్చుకుని వారికి ఉచితంగా విద్యను అందించాలని సంకల్పించింది. వారికి కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేటెడ్‌ క్యాంపస్‌ ను ఏర్పాటుచేసి ప్రత్యేక గురుకులాల్లో నాణ్యమైన విద్య అందించనుంది. అలాగే జీవితంలో స్థిరపడేలా ఉపాధి కల్పించి కుటుంబం ఏర్పాటుచేసేలా ఈ చట్టంలో ప్రత్యేక రక్షణలు కల్పించాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ చర్చించింది. అనాథలపై గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ నేతృత్వంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్​రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్​యాదవ్‌, వి.శ్రీనివాస్‌ గౌడ్‌, గంగుల కమలాకర్‌, ప్రత్యేక ఆహ్వానితులుగా బోయినపల్లి వినోద్‌ కుమార్‌ సభ్యులుగా ఉన్న కేబినెట్‌ సబ్‌ కమిటీ శనివారం సమావేశమై చర్చించింది. అనాథల కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొంతమంది పిల్లలను అడ్డుపెట్టుకుని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, వారితో సిగ్నళ్ల వద్ద భిక్షాటన చేస్తున్నారని, వీరిపై పీడీ చట్టం పెట్టి భవిష్యత్‌ లో ఇంకెవరు ఇలా చేయకుండా ఉండేందుకు కఠినచర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించాలని మంత్రులు సూచించారు. సిగ్నళ్ల వద్ద పిల్లలతో భిక్షాటన చేయించే వారిని గుర్తించి, వారికి ప్రభుత్వ హోమ్స్‌ లలో షెల్టర్‌ కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని సూచించారు. అనాథలను ప్రభుత్వ బిడ్డలుగా గుర్తిస్తూ వారికి ప్రత్యేక స్మార్ట్‌ ఐడీ కార్డులు ఇవ్వాలని, ఈ కార్డు ఉంటే కుల, ఆదాయ ధ్రువీకరణ వంటి ఇతర సర్టిఫికెట్‌ లకు మినహాయింపు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ముస్లిం అనాథలకు యతీమ్‌ ఖానాలు

రాష్ట్రంలో అనాథలకు ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో అన్ని విధాల సాయం అందుతోందని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శి, కమిటీ కన్వీనర్‌ దివ్య దేవరాజన్‌ తెలిపారు. రాష్ట్రంలో అనాథల కోసం నిర్వహిస్తున్న అనేక అనాథ ఆశ్రమాలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి, వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని మంత్రులకు వివరించారు. అనాథల కోసం వచ్చిన ప్రతిపాదనలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ముస్లింల్లో అనాథలను చేరదీసే విధంగా యతీమ్‌ ఖానాలు నిర్వహిస్తున్నారని, వాటిని కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి అన్ని విధాలుగా వారికి వసతులు కల్పించి అండగా నిలబడాలన్నారు. బిడ్డల కోసం చేసే ఖర్చును గ్రీన్‌ ఛానల్‌ లో పెట్టాలని, దీనికి ఎస్సీ, ఎస్టీ ప్రగతి పద్దుకు ఉన్నట్లు నిధులు ఆ ఏడాదిలో ఖర్చు కాకపోతే మురిగిపోకుండా వచ్చే సంవత్సరానికి ఉపయోగించుకునే విధానం పెడితే వారికి శాశ్వతంగా ఆర్థిక భద్రత లభిస్తుందన్నారు. సమాజంలో చాలామంది వ్యక్తులు, వ్యవస్థలు ఇలాంటి ప్రత్యేక పిల్లలకు ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చేందుకు చాలామంది ఉన్నారని, అనాథలకు ఆర్థిక సాయం చేయడం వల్ల టాక్స్‌ మినహాయింపు వస్తుందన్న విషయం అందరికీ తెలియదని, దీనిని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకురావాలని కోరారు.