- ఆలయాలకు పోటెత్తిన భక్తులు
- న్యూ ఇయర్ వేళ ఘనంగా పూజలు
- కోరికలు నెరవేరాలని ప్రత్యేక మొక్కులు
సామాజికసారథి, హైదరాబాద్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. 2022లో మంచి జరగాలని విశేషపూజలు నిర్వహించారు. కొంతమంది తమ మొక్కులు చెల్లించుకునేందుకు పిల్లాపాపలతో తరలివచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని బిర్లామందిర్‌కు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారులు ఇలా వివిధ రంగాలకు చెందిన వారంతా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కరోనా పీడ పోవాలని కోరుకున్నారు. నగరవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాల్లో కూడా భక్తుల రద్దీపెరిగింది. అలాగే చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో ప్రదక్షిణలు నిలిపివేసి నేరుగా దర్శనభాగ్యం కల్పించారు. అలాగే చిక్కడపల్లి, హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్ వెంకటేశ్వర ఆలయాలు, డీడీకాలనీ అహోబిల నారసింహ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చిన్నాచితక ఆలయాల్లో కూడా భక్తులు పోటెత్తారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే స్వామివారి దర్శనానికి అనుమతినిచ్చారు. స్వాతి నక్షత్రం కావడంతో అర్చకులు సహస్ర కళషాభిషేకం నిర్వహించారు. అలాగే వరంగల్‌లోని భద్రకాళీ అమ్మవారు, బాసర సరస్వతి అమ్మవారు, కేతకి సంగమేశ్వర ఆలయం, ఏడుపాయల వనదుర్గమ్మ, అలంపూర్జోగుళాంబ అమ్మవారు, అలాగే జములమ్మ అమ్మవారు, మహబూబ్‌నగర్‌జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వరస్వామి, రేణుకా ఎల్లమ్మ ఆలయంలో భక్తజన సందడి నెలకొన్నది. మహిళలు విశేషపూజలు జరిపించి మొక్కులు చెల్లించుకున్నారు.
- ఇంద్రకీలాద్రి పైకి పోటెత్తిన భక్తులు
అలాగే విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని పండితులు ఆశీర్వదించారు. నూతన సంవత్సరంతో పాటు భవానీదీక్షాపరుల రాకతో విజయవాడ ఇంద్రకీలాద్రిపైకి భక్తుల రద్దీ పెరిగింది. కొత్త ఏడాది ఆరంభమైన రోజు కావడంతో జనవరి 1న సాధారణ భక్తులు దుర్గమ్మ ఆలయానికి వస్తుంటారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్దసంఖ్యలో తరలొచ్చారు.