Breaking News

రాజకీయాలు కాదు అభివృద్దే ముఖ్యం

✓ముస్లింల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా..
✓ హౌజ్, ఈద్గా, ఖబ్రస్థాన్ నిర్మాణానికి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా..
✓పదవులు శాశ్వతం కాదు ప్రజలకు చేసిన సేవే ముఖ్యం..ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

సామాజిక సారథి , నాగర్ కర్నూల్: రాజకీయాలు ముఖ్యం కాదని అభివృద్దే ముఖ్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ పట్టణ ముస్లింల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 3 కోట్ల 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్రి జనార్దన్ రెడ్డిని వివిధ ముస్లిం సంఘాల పెద్దలు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు ముఖ్యం కాదని ఈ ప్రాంతానికి ప్రతినిధిగా ఉండి ఏమి చేశారన్నదే ముఖ్యమన్నారు. నాగర్ కర్నూల్ లో నా హాయంలో జరిగిన అభివృద్ధి ఏమిటో కళ్ళముందే ఉంది అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఏర్పాటు నుండి మెడికల్ కళాశాల ఏర్పాటు జిల్లా కలెక్టర్, పోలీసు శాఖ సమీకృత కార్యాలయాలు హైదరాబాద్ కు తీసుపోని విధంగా ట్యాంక్ బండ్, బుద్దుడి విగ్రహం అడుగు అడుగున ప్రతి వీధికి సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయన్నారు. దీనికి తోడు అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాల ఈ ప్రాంతానికి ఒక కలికితు రాయి అని చెప్పవచ్చునారు. ఉయ్యాలవాడ నుండి బస్ డిపో వరకు ప్రధాన రహదారిపై డివైడర్ నిర్మాణం ద్వారా ప్రయాణికులకు సౌకర్యాడమే కాకుండా పట్టణానికి ఒక అందం అన్నారు.ఈ ప్రాంతానికి ఒక ఇంజనీరింగ్ కళాశాలను పాలిటెక్నిక్ కళాశాలను తీసుకురావడానికి కృషి చేస్తున్నానని మీ ఆశీర్వాదంతో సాధిస్తానన్నారు. హజ్ హౌస్, షాదీ ఖానా నిర్మాణాలు చేపట్టే బాధ్యత పూర్తిగా నాపై వదిలి పెట్టాలన్నారు. పెద్ద కాంట్రాక్టర్లను రప్పించి ఈ పనులు పూర్తి చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా కబ్రస్తాన్ కోసం మరో ఐదు ఎకరాల స్థలాన్ని సమీకరించి అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వక్ఫ్ కాంప్లెక్స్ స్థలంలో నిరుపేద ల కోసం ఆటోనగర్ నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయడానికి ముస్లిం పెద్దల సహకారం అవసరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. నిరుపేద ముస్లింల విద్య కోసం పెద్దపీట వేస్తూ గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. కలిసికట్టుగా ఉంటూ అభివృద్ధికి సహకరిస్తే అందరి సంక్షేమం జరుగుతుందన్నారు. ముస్లింల కు ప్రభుత్వం అందించే పథకాలలో భాగస్వాములను చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అభివృద్ధికి చేయూత అందిస్తున్నారు. మీ సహకారం నాకు ఎల్లప్పుడూ ఉండాలని మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని ఆయన కోరారు. రాజకీయాలలో 40 ఏళ్లుగా అనేకమంది వచ్చారని వారు చేసిన అభివృద్ధి ఏమిటో తొమ్మిదేళ్లలో నేను చేసిన అభివృద్ధి ఏమిటో మీ కళ్ళముందర ఉంది అన్నారు. నాగర్ కర్నూల్ ను మరింత అభివృద్ధి చేసుకునే విధంగా మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు సాగుతానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ముస్లింలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు,సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్లా ఖాన్ ఇప్పటివరకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ముస్లింలకు చేసిన అభివృద్ధిని వివరించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అన్ని పనులు చేస్తానని హామీ ఇచ్చారు. మరో 50 లక్షల రూపాయలు తో మీరు కోరిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని ఇందుకు పూర్తి బాధ్యత నాదేనని మర్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం అడ్వైజరీ కమిటీ బాధ్యులు షేఖ్ యాకూబ్ బావజీర్,మొహమ్మద్ సాదిక్ పాషా, జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు షేఖ్ ఫరీద్ అహ్మద్, సభ్యులు శుకూర్, వక్ఫ్ కాంప్లెక్స్ భవన నిర్మాణ కమిటీ కార్యదర్శి అబ్దుల్లా ఖాన్, మదరస ఇస్లామియా ఫజల్ ఉల్ ఉలూమ్ కమిటీ కార్యదర్శి సయ్యద్ రఫీ యొద్దిన్, సభ్యులు అబ్దుల్ అలీమ్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ ముస్తాక్ అహ్మద్, కౌన్సిలర్ ఇసాక్ మీయ్య, లతోపాటు వివిధ మస్జిద్ కమిటీల బాధ్యులు ముస్లిం సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.