- జమీందారీ లక్షణాలు పక్కనపెట్టాలి
- టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ
పనాజీ: బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ కాంగ్రెస్‌పై మరోమారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గోవాలో తమతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తే, ఆ పార్టీ ముందుకు రావొచ్చని మమత ప్రకటించారు. అయితే జమీందారీ లక్షణాలను మాత్రం పక్కన పెట్టాలని చురకలంటించారు. గోవా పర్యటనలో భాగంగా మమతాబెనర్జీ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ను తానేమీ విమర్శించనని అంటూనే విరుచుకుపడ్డారు. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ విశేషమైన పనులు చేస్తున్నట్లు ఏమీ కనిపించడం లేదని పెదవివిరిచారు. అయితే బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ ఏదైనా పనికి పూనుకుంటే మాత్రం తమకు వచ్చిన అభ్యంతరమేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీతో తమ పొత్తు ఖాయమైందని మమత ప్రకటించారు. తమతో పొత్తు పెట్టుకోడానికి కాంగ్రెస్ ముందుకు రాకుంటే, ఇక ఏ పార్టీ ముందుకు రాదన్న భ్రమలో ఉండిపోయిందన్నారు. కానీ ఎంజీపీ ముందుకొచ్చిందని ఆమె తెలిపారు. ఈ ఆలోచనా విధానం నుంచి కాంగ్రెస్ బయటపడితే బాగుంటుందని సూచించారు. తమ పార్టీ హిందువులకు వ్యతిరేకమని బీజేపీ ప్రచారం చేస్తోందని, అది శుద్ధతప్పు అని మమత స్పష్టం చేశారు.