Breaking News

దళిత ప్రజాప్రతినిధులంటే చులకన!

దళిత ప్రజాప్రతినిధులంటే చులకన!
  • సోషల్ మీడియాలో అగ్రవర్ణాల వ్యక్తులు ఇష్టమొచ్చినట్లు కామెంట్లు
  • పోలీసులకు వెలుగొండ గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులు ఫిర్యాదు

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో కొందరు అగ్రవర్ణాల నాయకులకు దళిత ప్రజాప్రతినిధులంటే లెక్కలేకుండా పోయింది. గ్రామపంచాయతీ పరిధిలో ఏ చిన్న ఇష్యూ జరిగినా కొందరు అగ్రకుల లీడర్లు ఫొటోలు తీసి ప్రజాప్రతినిధులను అవమానపరిచేలా బూతుపదాలతో కామెంట్లు చేస్తున్నారు. వాటికి ఆ గ్రూపులోని అదే సామాజికవర్గానికి చెందిన మరికొందరు సపోర్ట్ చేస్తూ లైక్ లు , కామెంట్లు చేస్తూ అగ్నికిఆజ్యం పోస్తున్నారు. వెలుగొండ గ్రామపంచాయతీలో ఉన్న పలువురు దళితప్రజాప్రతినిధులపై సోషల్ మీడియా వేదికగా తిట్ల పురాణం అందుకుంటున్నారు. తాజాగా గ్రామపంచాయతీ కార్యాలయానికి ఎదురుగా కొందరు చిరు వ్యాపారులు వ్యాపార కోసం కొత్తగా డబ్బా వేసుకోవడంపై సదరు అగ్రకులానికి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియా వేదికగా తిట్ల పురాణం అందుకున్నారు. కాగా, దళిత ప్రజాప్రతినిధులను అగౌరపరుస్తూ వాట్సాప్ లో కామెంట్లు పెట్టడంపై శుక్రవారం వార్డు సభ్యులు పరుశరాములు, కుర్వమ్మ, నాగేష్, మల్లయ్య తదితరులు అడ్డగోలు కామెంట్లు చేస్తున్న ఎన్.మధుసూదన్ రెడ్డిపై బిజినేపల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. వార్డు మెంబర్లు దళితులు, బీసీలు కావడంతోనే కులవివక్షతో తమపై బూతులు రాస్తూ తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారని, మధుసూదన్​ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టప్రకారం శిక్షించాలని వారు పోలీసులను కోరారు.

పోలీసులు కేసులు నమోదు చేస్తారా?
నాగర్ కర్నూల్ జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో అధికారపార్టీ నాయకులకు, అగ్రవర్ణాలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారన్న అపవాదు వాడుకలో ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల అవినీతిని ప్రశ్నించినా, ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని అడిగినా పోలీసులు ఆగమేఘాల మీద వారిని స్టేషన్ పిలిపించి వార్నింగ్ లు ఇవ్వడం, లేదంటే పోలీస్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం పరిపాటిగా మారింది.సాధారణ ప్రజలు, నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినా అవతలి వ్యక్తులపై యాక్షన్ తీసుకుంటారన్న నమ్మకం ఇంకా ప్రజల్లో కలగడం లేదు. ప్రస్తుతం వెలుగొండ గ్రామపంచాయతీ పరిధిలో వార్డుసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన వ్యక్తులు అగ్రవర్ణాలకు చెందిన వారు కావడంతో వారిపై చర్యలు ఉంటాయా? లేదా? అన్నది వేచిచూడాలి.