న్యూఢిల్లీ : దేశంలో కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు భారత్‌కు అండగా నిలుస్తున్నారు. తాజాగా టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా పీఎం కేర్స్‌కు విరాళం ప్రకటించారు. భారత్‌తో పాటు ప్రపంచదేశాలు కొవిడ్ పై పోరాడుతున్న తీరును తాను గమనిస్తూనే ఉన్నానని, ఈ క్రమంలో వస్తున్న వార్తలపై ఆందోళన చెందుతున్నట్టు ఆయన తెలిపారు.
‘భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారి సవాలును ఎదుర్కొంటున్నాయి. కొవిడ్-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్న ఈ క్లిష్ట పరిస్థితులలో తోటి భారతీయ సోదరీ, సోదరులకు సంఘీభావంగా పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం ఇవ్వాలని దలైలామా ట్రస్టును కోరాను’ అని దలైలామా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొవిడ్‌పై పోరులో భాగంగా ముందు వరుసలో ఉండి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఈ మహమ్మారి పీడ త్వరలోనే విరగడ అవ్వాలని తాను ప్రార్థి్స్తున్నట్టు దలైలామా తెలిపారు.