- వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఇటీవల జర్మనీ నుంచి తిరిగొచ్చిన తర్వాత మొదటిసారి బుధవారం వేములవాడ రెండవ బైపాస్ రోడ్డులోని గెస్ట్ హౌస్ లో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను ప్రజలకు దూరంగా ఉంటారని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టారు. కొవిడ్ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబసభ్యులతో జర్మనీలోనే ఉండాల్సి వచ్చిందని వెల్లడించారు. అయినా జిల్లా, నియోజకవర్గ అధికారులతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. తనతో పాటు తమ కుటుంబసభ్యులను నాలుగు పర్యాయాలు ఇక్కడి ప్రజలు ఎంతగానో ఆదరించారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన వెంట పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.