- మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి
ముంబై: కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తీవ్రం కావడంతో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించని పక్షంలో లాక్‌డౌన్ అమలు చేయక తప్పదని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో గడిచిన ఎనిమిది రోజుల్లో 1.17 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అందులో ఒక్క మహరాష్ట్రలోనే 41 వేల కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. రోజురోజుకు కరోనాతోపాటు ఒమిక్రాన్కేసులు పెరిపోతున్నాయని, లాక్‌డౌన్ వద్దనుకుంటే కరోనా నియమాలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రజల నిర్లక్ష్యం వల్లే కేసులు పెరుగుతున్నాయని, జనాలరద్దీని తగ్గిస్తే కేసులు అదుపులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో సినిమా థియేటర్లు, ఆలయాలు మూసివేత విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని, అనేక జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించామన్నారు. ఇటీవల ముంబైలోని ధారావిలో వేయి రూపాయలకే నకిలీ యూనివర్సల్ పాస్ జారీచేసే ముఠాను పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.