- అధికారంలో ఉన్నామని విర్రవీగొద్దు
- కొడుకుపై దాడి జరిగితే ఎమ్మెల్యేతో కాంప్రమైజ్
- దళిత సంఘాలను ఆమె భర్త ఏనాడూ పట్టించుకోలేదు
- ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరిగిల్ల దశరథం
సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జడ్పీ చైర్ పర్సన్ కుమారుడు గణేశ్దే ముమ్మాటికీ తప్పని తేలిందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరిగిల్ల దశరథం అన్నారు. చట్టం అందరికీ సమానమేనని జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి కుమారుడు వ్యవహరించిన తీరుపై తాము కూడా విచారణ చేశామని వాస్తవ విషయాలు తెలుసుకున్నామని తెలిపారు. అధికారం చేతిలో ఉంది కదా? అని ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే ఎలాగని నిలదీశారు. మొదట ఎస్సై ఓబుల్ రెడ్డికి సారీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి కుమారుడు గణేశ్‌పై ఈనెల 21న బిజినేపల్లి ఎస్సై కృష్ణ ఓబుల్‌రెడ్డి దాడిచేసి దుర్భాలాషలాడారని ఆమె ఎస్పీకి ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరిగిల్ల దశరథం స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమపై దాడి జరిగిందని, అవమానానికి గురయ్యామని చెబుతున్న బాధితులు.. దళిత సంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్న సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. జడ్పీ చైర్మన్ భర్త బంగారయ్య మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారని, కనీసం జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి ఏ ఒక్క ధర్నాలోనైనా పాల్గొన్నారా? అని నిలదీశారు. అవమానం జరిగిన వారికి లేని బాధ దళిత సంఘాలకు ఎందుకని ప్రశ్నించారు. సంఘాల నాయకులకు ఏదైనా జరిగితే అధికారపార్టీలో ఉన్నా జడ్పీ చైర్ పర్సన్ భర్త ఏ ఒక్క రోజైనా మద్దతు తెలిపారా? అని అన్ని ప్రశ్నించారు. ఎస్సై కృష్ణఓబుల్‌రెడ్డి తన విధులను సక్రమంగానే నిర్వహించారని, పోలీసు సిబ్బందిపై దాడి చేశారని తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారని తేలిందన్నారు. జడ్పీ చైర్పర్సన్ చెబుతున్నట్లు ఎక్కడా అవమానం జరగలేదన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక నాటినుంచి చైర్మన్ పద్మావతికి ఎన్నిసార్లు అవమానాలు జరిగినా ఎప్పుడు దళిత సంఘాలు ఖండిస్తున్నాయే తప్ప వారు మీడియా ముందుకొచ్చి ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. కొడుకుపై దాడి జరిగితే ఎమ్మెల్యేతో కాంప్రమైజ్ అయ్యారని విమర్శించారు. వారికి పదవులు, పార్టీ కావాలని, ఇప్పటికైనా తోటి దళిత సంఘాల నాయకులు వాస్తవ విషయాలు తెలుసుకోవాలని హితవు పలికారు.