- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్
సారథి, బిజినేపల్లి: వట్టెం ప్రాజెక్టు నిర్మాణ పనుల నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి, ఆలస్యం, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన వట్టెం రిజర్వాయర్ 11వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. రిజర్వాయర్ వద్ద నాణ్యత లేని పనులు జరుగుతున్నాయని, తమకు సరైన పరిహారం ఇవ్వడం లేదని ముంపు గ్రామాల ప్రజలు వారి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అత్యంత ప్రతిష్టాత్మకమైన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన బిజినేపల్లి మండలంలోని వట్టెం రిజర్వాయర్ పూర్తయితే ఎన్నో వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నారని గుర్తుచేశారు.
మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు పర్యవేక్షణ చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పనులను ఇలా చేయడం ద్వారా భవిష్యత్లో ప్రాజెక్టు ప్రమాదానికి గురైతే ఎన్నో గ్రామాలు నీట మునగడంతో పాటు రూ.వేలకోట్ల ప్రజాధనం వృథా అయ్యే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా మొత్తాన్ని కాళేశ్వరానికి ఖర్చుపెట్టి, పాలమూరు ప్రాజెక్టులకు పంగనామాలు పెట్టిందని, దక్షిణ తెలంగాణను ఎడారి చేసే కుట్ర సాగుతోందన్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మల్లన్నసాగర్ కో న్యాయం, పాలమూరుకో న్యాయమా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ అరవిందాచారి, శ్రీనివాస్, శివాజీ, శేఖర్ గౌడ్, బలిజ రమేష్, శంకర్, గ్రామస్తులు రాజునాయక్, శివ, వెంకటేశ్పాల్గొన్నారు.