సామాజిక సారథి, బిజినేపల్లి: బీసీలగణన సాధనకోసం డిసెంబర్ 13, 14, 15వ తేదీల్లో బీసీల చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్జిల్లా బిజినేపల్లి మండలంలో బీసీ కుల సంఘాల నాయకుల మద్దతుతో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు 13న బీసీల జంగ్సైరన్, 14న పార్లమెంట్ముట్టడి, 15న జాతీయస్థాయి అఖిలపక్ష సమావేశం ఉంటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ కులగణన మద్దతిచ్చి అధికారంలోకి వచ్చాక వెనక్కి తగ్గడం సరికాదన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా ప్రశ్నించనందున తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆరెకటిక సంఘం నాగర్ కర్నూల్జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు రఘుబాబు, ఆరెకటిక సంఘం జిల్లా సలహాదారు జానకి రాములు, ముదిరాజ్ సంఘం బిజినేపల్లి మండలాధ్యక్షుడు అల్లాజి, మండల కార్యదర్శి శ్రీనివాసులు, బి.కృష్ణయ్య,శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.