- రాష్ట్ర మంత్రుల ఆశ్చర్యం, అభినందనలు
సామాజికసారథి, హైదరాబాద్: అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన సిరిసిల్లకు చెందిన యువ చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. విజయ్ కుటుంబసభ్యులతో హైదరాబాద్ వచ్చి మంత్రులకు తాను నేసిన చీరను చూపించారు. చీర నేసేందుకు పట్టిన సమయం, ఎలా నేసారనే వివరాలు మంత్రులు విజయ్‌ని అడిగి తెలుసుకున్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి వినడమే కానీ తాను ఇంతవరకూ చూడలేదని మంత్రి సబిత అనగా.. ఆ చీరను మంత్రి సబితకు గిప్ట్‌గా ఇచ్చారు. నేతన్నలను ఆదుకునేందుకు సర్కార్ తీసుకున్న చర్యలతో సిరిసిల్ల నేత కార్మికుల్లో ఎన్నో మార్పులు వచ్చాయని, ఆధునిక మగ్గాలు, అధునాతన పద్ధతులతో దుస్తులు నేస్తున్నామని విజయ్ మంత్రులకు వివరించారు. సంప్రదాయ మగ్గంపై అగ్గిపెట్టెలో పట్టే చీర నేయడానికి రెండు వారాల సమయం పడుతుందని, తాను ఆధునిక మరమగ్గాలపై నేయడంతో మూడు రోజుల్లోనే పూర్తయిందని చెప్పగా మంత్రులు విజయ్‌ని అభినందించారు. చేనేత వస్త్రాల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నానని, దాని ప్రారంభోత్సవానికి రావాలని కేటీఆర్‌ను విజయ్ కోరగా.. అన్నివిధాలా అండగా ఉంటానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.