- పేదల కోసం ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపుపై అక్కసు
- జీర్ణించుకోలేక రద్దుచేయించిన ఓ బడా నేత
- సొంతపార్టీ నేతలే క్యాన్సిల్ చేయించడంపై ఎమ్మెల్సీ గుస్సా
- తనకు అడ్డంకులు సృష్టించడంపై కీనుక
- మరోసారి అధికారపార్టీలో భగ్గుమన్న గ్రూపు రాజకీయాలు
సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లాలో పాలిటిక్స్ మరింత హీటెక్కుతున్నాయి.. నేతలు బలాబలాలను సరిచూసుకుంటున్నారు.. పోటాపోటీగా పర్యటనలు, కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు శర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకేపార్టీలో రెండు వర్గాల మధ్య నిశ్శబ్ధయుద్ధం నడుస్తోంది.. తాజాగా కందనూలు అధికారపార్టీలో ‘క్యాంపు రాజకీయం’ చిచ్చురేపింది. నేతల మధ్య వర్గపోరు మరోసారి బట్టబయలైంది. వివరాల్లోకెళ్తే.. వైద్యపరంగా పేదప్రజలకు ఫ్రీగా మెడికల్ టెస్టులు చేయించాలనే తలంపుతో నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో స్థానిక ఎంపీటీసీ సభ్యులు యశోద ఆస్పత్రి వారి సౌజన్యం, స్థానిక ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి సహకారంతో ఉచితంగా మెడికల్ క్యాంపు ఏర్పాటుచేశారు. సాధారణ జబ్బులకు ఇక్కడే మందులు ఇవ్వడం, పెద్ద పెద్ద జబ్బులు నిర్ధారణ అయితే హైదరాబాద్‌కు రెఫర్ చేసేలా ప్లాన్ చేశారు. ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో చుట్టూ పక్కల గ్రామాల నుంచి జనం కూడా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అందుకు సంబంధించి స్థానిక నాయకులు కూడా భారీగా ఏర్పాట్లుచేశారు. వచ్చే రోగుల కోసం పెద్దఎత్తున భోజనాలూ సిద్ధంచేశారు. ఎమ్మెల్సీకి ఆహ్వానాలు పలుకుతూ ఆయన కేడర్ తాడూరు మండల కేంద్రంలో భారీ భారీ ఫ్లెక్సీలను సైతం ఏర్పాటుచేసింది. అంతా ఓకే.. ఇక స్టార్ట్ అనుకున్న సయమంలో పిడుగు లాంటి వార్త.. యశోద ఆస్పత్రి వారు మెడికల్ క్యాంపును రద్దు చేస్తున్నామని మెల్లగా నిర్వాహకులకు సమాచారం అందించారు. దీనిపై ఏం జరిగి ఉంటుందని అటు రోగులు.. ఇటు నిర్వాహకులు ఆరా తీయడం మొదలుపెట్టారు. యశోద ఆస్పత్రి వారి నిర్ణయంతో ఒక్కసారిగా నిర్వాహకులు హతాశులయ్యారు. చేసిన ఏర్పాట్లన్నీ వృథాగా పోయాయని పెదవి విరిచారు.
చక్రం తిప్పిన నేత ఎవరు?
టీఆర్ఎస్ పార్టీలో ఏ నియోజకవర్గానికి వెళ్లిన అంతర్గత కుమ్ములాటలు తప్ప పార్టీ ప్రతిష్టను పెంచే ఒక కార్యక్రమం కూడా జరగడం లేదని ఇటీవల స్పష్టమవుతోంది. ఏ కార్యక్రమం జరిగినా తమకు వ్యక్తిగతంగా మైలేజ్ వచ్చేందుకే చూసుకుంటున్నారు తప్ప పార్టీ ఇమేజ్ ను ఏమాత్రం పట్టించుకోవడం లేదనే అపవాదు ఉంది. ఇదే విషయం మెడికల్ క్యాంపు విషయంలో కూడా జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. క్యాంపు ఏర్పాటు చేసింది ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి వర్గీయులు కావడంతో ఆయనకు గిట్టని టీఆర్ఎస్ పార్టీలోని మరోవర్గం ఈ క్యాంపును ఆపివేయించిందని ఆరోపణలు గుప్పుమన్నాయి. రాజకీయాలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలని, ప్రజల ప్రయోజనం కోసం నిర్వహించే ఇలాంటి హెల్త్క్యాంపులపై చూపించడం ఏమిటని సొంత పార్టీ నాయకులే పెదవి విరిచారు. సామాన్యులకు మేలు చేసేలా రాజకీయాలు ఉండాలని, ఒకింత కీడు చేసేలా ఉండొద్దని హితవు పలుకుతున్నారు.
రంగంలోకి యశోద ఎండీ
ఎమ్మెల్సీ వర్గీయులు క్యాంపు నిర్వహిస్తున్నారని తెలియడంతో స్థానిక నేతలు నియోజకవర్గంలోని బడానేతకు సమాచారం చేరవేశారు. దీంతో ఆయన హుటాహుటిన మేల్కొని టీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేత సీఎం వద్ద సన్నిహితంగా ఉండే ఓ ఎంపీ ద్వారా యశోద ఆస్పత్రి పెద్దకు ఫోన్ చేయించి తాడూరు గ్రామంలో జరిగే మెడికల్ క్యాంపు ఆపివేయాలని హుకుం జారీచేయించారు. దీంతో యశోద ఆస్పత్రి ఎండీ నిర్వాహకులకు ఫోన్ చేసి క్యాంపు ఆపివేయాలని సూచనలు జారీచేశారు. దీంతో ఈ విషయాన్ని నిర్వాహకులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకురావడంతో అసలు తాను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టా? లేనట్టా? అని అంతర్మథనం చెందుతున్నారు. ఈ పరిమాణం కందనూలు రాజకీయాల్లో ఎటు దారితీస్తుందోనని పొలిటికల్జంక్షన్లో టాక్ నడుస్తోంది.