Breaking News

బండి సంజయ్‌ కు ఊరట

బండి సంజయ్‌ కు ఊరట
  • విడుదల చేయాలని జైళ్లశాఖకు హైకోర్టు ఆదేశాలు
  • రిమాండ్‌ రిపోర్టును తప్పుబట్టిన ఉన్నతన్యాయస్థానం
  • కేసు విచారణను 7వ తేదీకి వాయిదా 

సామాజికసారథి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను విడుదల చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జ్యూడీషియల్‌ రిమాండ్‌ పై హైకోర్టు స్టే విధించింది. వ్యక్తిగత పూచీకత్తు, రూ.40వేల బాండ్‌ పై విడుదల చేయాలని జైళ్లశాఖ డీజీని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్‌ కు ఆదేశాలు ఇవ్వడం సరికాదని హైకోర్టు పేర్కొన్నది. ఈ మేరకు  ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 7కు హైకోర్టు వాయిదా వేసింది. బండి సంజయ్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ ను కొట్టివేసింది. అరగంటలో కేసు, అరెస్ట్‌, రిమాండ్‌ చేయడంలో మీ ప్రత్యేక శ్రద్ధ ఏమిటని పోలీసులను ప్రశ్నించింది. మీరు పెట్టిన 333 సెక్షన్‌ అక్రమమే, ఎఫ్‌ఐఆర్‌ లో నుంచి ఆ సెక్షన్‌ తొలగించాలని, చట్టాన్ని అందరికి సమానంగా వర్తింపజేయాలని ఆదేశించింది. బండి సంజయ్‌ ను రిలీజ్‌ చేయాలని జైళ్లశాఖ డీజీకి ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రభుత్వం జారీచేసిన 317 జీవో రద్దుచేయాలని ఈనెల 2న కరీంనగర్‌ లో జాగరణ దీక్షకు దిగిన బండి సంజయ్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కరీంనగర్‌ జిల్లా కోర్టులో హాజరుపర్చగా ఆయన 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. బండి సంజయ్‌ పై తప్పుడు కేసులు పెట్టారని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.