Breaking News

బల్కంపేట ఎల్లమ్మ ఆలయాభివృద్ధికి శ్రీకారం

బల్కంపేట ఎల్లమ్మ ఆలయాభివృద్ధికి శ్రీకారం
  • భక్తుల పార్కింగ్‌కు మల్టీ లెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్‌
  • నిర్మాణాలను ప్రారంభించనున్న మంత్రి తలసాని

సామాజికసారథి, హైదరాబాద్‌: బల్కంపేట్‌ ఎల్లమ్మ అమ్మవారి ఆలయాభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల మౌలిక సదుపాయల కల్పనకు చర్యలు చేపట్టింది. ఎంతో ప్రసిద్ధిచెందిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలిరావడం, సరైన పార్కింగ్‌ సౌకర్యం లేకపోవడంతో తీవ్రఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా వాహనాల కారణంగా తరచూ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి సాధారణ ప్రయాణికులకు సైతం ఇక్కట్లు తప్పడం లేదు. దీంతో భక్తుల సౌకర్యం కోసం రూ.4.48 కోట్లతో 1,161 గజాల స్థలంలో మల్టీలెవల్‌ పార్కింగ్‌తో పాటు షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఈ నెల 31న పనులు ప్రారంభించనున్నారు. బుధవారం పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాసాబ్‌ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయాధికారులతో సమీక్షించారు. మొత్తం 1,161 గజాల స్థలంలో 638 గజాల స్థలం ఆలయానికి సంబంధించింది కాగా, మరో 523 గజాలు జీహెచ్‌ఎంసీకి చెందిన ఈ స్థలాన్ని దేవాదాయ శాఖకు బదిలీచేశారని వివరించారు. రూ.6 లక్షలతో చేపట్టనున్న బోర్‌ వెల్‌ పనులను కూడా ఇదే రోజున ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆలయం లోపల, బయట నూతన క్యూలైన్ల ఏర్పాటు చేయనున్నామని, అమ్మవారి దర్శనానికి ఆదివారం, మంగళవారం భక్తులు పెద్దఎత్తున తరలివస్తుండడంతో ఈ రెండు రోజులు ట్రాఫిక్‌ మళ్లింపునకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. సమావేశంలో ఆలయ ఈవో అన్నపూర్ణ, ఎస్‌ఈ మల్లికార్జున్‌ పాల్గొన్నారు.