- ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో ఆపరేషన్ వికటించి నలుగురి మృతి
- అసలే పేద కుటుంబాలు.. అంతులేని దు:ఖం
- మహిళల కుటుంబాలను పరామర్శించిన బీఎస్పీ నేతలు
- రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా, రెండెకరా భూమి ఇవ్వాలని డిమాండ్
సామాజికసారథి, ఇబ్రహీంపట్నం: అసలే పేద కుటుంబాలు.. కూలీ పనికిపోతేనే కడుపునిండేది. అలాంటి మహిళలను మాయదారి ఆపరేషన్ పొట్టనపెట్టుకున్నది. చనిపోయిన నలుగురిలో ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీళ్లే ఉబికి వస్తున్నాయి. వారి పిల్లలను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మృతిచెందారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీ తరఫున మృతుల కుటుంబసభ్యులను పార్టీ స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ మందా ప్రభాకర్, బడంగ్ పేట డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ నేతృత్వంలో బుధవారం పలువురు నాయకులు పరామర్శించారు. సీతారాంపేట, లింగంపల్లి గ్రామాల్లో లావణ్య, మైలారం సుష్మ కుటుంబసభ్యులను కలిసి ఓదార్చారు.ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని, చనిపోయినవారి కుటుంబాలకు రూ.50లక్షలు, రెండు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, వారి భర్తలకు ప్రభుత్వ ఉద్యోగం, పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వమే చూసుకోవాలని డిమాండ్ చేశారు. వారికి నెలకు రూ.20వేలు అందజేయాలని కోరారు. వారికి న్యాయం చేయకపోతే బీఎస్పీ తరఫున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
పరామర్శించిన శ్రీనివాస్ యాదవ్
కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మాడుగుల మండలం నర్సాయిపల్లి, రాజీవ్ నగర్ తండాకు చెందిన మమత, మౌనిక కుటుంబసభ్యులను బీఎస్పీ కల్వకుర్తి ఇన్చార్జ్ కొమ్ము శ్రీనివాస్ యాదవ్ బుధవారం పరామర్శించారు. ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో ఆశపడి తెచ్చుకున్న తెలంగాణలో పేదప్రజల కోసం పనిచేయల్సిన ఈ ప్రభుత్వం పేదల ప్రాణాలు తీస్తున్నదని అన్నారు. ఈ ప్రభుత్వానికి కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కనీసం బాధితులను పరామర్శించకపోవడం సిగ్గుచేటన్నారు. ఆయన వెంట కల్వకుర్తి అసెంబ్లీ అధ్యక్షుడు ఎట్టి, ఆమనగల్లు మండల ఇన్ చార్జ్శ్రీశైలం, మాడ్గుల మండల కన్వీనర్ బద్ది రాజు, రవి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.