- కేంద్రమార్గదర్శకాల మేరకు ఏర్పాట్లు
- వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు
సామాజికసారథి, హైదరాబాద్: జనవరిలో బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పిల్లలు, 60ఏళ్ల పైబడిన వారికి ఇస్తామన్నారు. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ పేదలకు ఉచితంగా వైద్యం అందించే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీలో ప్రారంభించిన బస్తీ దవాఖానాలు సక్సెక్స్ అయ్యాయి. దీంతో వాటిని ఇతర పట్టణాలకు విస్తరించేందుకు సర్కారు సిద్ధమైంది. ఎంసీహెచ్‌ఆర్డీలో వైద్యారోగ్యశాఖపై జరిగిన సమీక్షలో పాల్గొన్న మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ రాష్ట్రంలో బస్తీ దవాఖానాల ఏర్పాటు అంశంపై చర్చించారు. జూన్ 2 నాటికి రెండు దశల్లో 141 మున్సిపాలిటీల్లో 288 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవి అందుబాటులోకి వస్తే తెలంగాణలో మొత్తం బస్తీ దవాఖానాల సంఖ్య 544కు చేరనుంది. టీ డయాగ్నోస్టిక్స్ సహకారంతో ప్రజలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఫలితంగా ఎలాంటి ఖర్చులేకుండా పట్టణ పేదలకు నాణ్యమైన వైద్యం అందనుంది. నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో స్థానంలో నిలవడంపై మంత్రి హరీశ్ రావు, ఆరోగ్య శాఖ సిబ్బందికి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది నాలుగో స్థానం నుంచి ఈ ఏడాది 3వ స్థానానికి చేరడం అభినందనీయమన్నారు. వచ్చే ఏడాది ఆరోగ్య సూచీలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.