Breaking News

భయపెడుతున్న ‘బ్లాక్ ఫంగస్’

భయపెడుతున్న ‘బ్లాక్ ఫంగస్’

సారథి, హెల్త్ డెస్క్: అసలే కరోనా కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. ఎక్కడి నుంచి ఎక్కడికి దాపురిస్తుందో తెలియడం లేదు. ఎప్పుడు ఎవరిని బలితీసుకుంటుందో అంతుచిక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకున్న ప్రజలను మరో కొత్త రోగం వణికిస్తోంది. ఇది అంటువ్యాధి కాదు.. ఎవరికి పడితే వారికి రాదు. ఇది కాస్త ఉపశమనం కలిగించే విషయం. కరోనా వ్యాధితో కోలుకున్న పేషెంట్లకు ఈ రోగం వస్తోంది. తగిన సమయంలో గుర్తించకుంటే ప్రాణాలు తీస్తోంది. అదే బ్లాక్​ఫంగస్. దీన్ని మ్యుకర్​మైకోసిస్​ అని శాస్త్రీయ పరిభాషలో పిలుస్తారు. ఇది కొవిడ్ ​పేషెంట్లను కొత్త ముప్పుగా మారింది. కరోనా సోకిన షుగర్​పేషెంట్లు, ట్రీట్​మెంట్​లో ఎక్కువ మోతాదులో స్టిరాయిడ్స్ ​వాడినవారు ఎక్కువగా బ్లాక్​ఫంగస్​ బారినపడుతున్నారు. మొదట్లో ఈ వ్యాధిని మహారాష్ట్రలో గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకూ విస్తరించింది. గాంధీలో ముగ్గురికి ఈ లక్షణాలు కనిపించాయి. అలాగే ఒకరు ఈ వ్యాధితో చనిపోయారు. తొలి దశలోనే ఈ వ్యాధిని గుర్తించి ట్రీట్​మెంట్​అందిస్తే ప్రాణాపాయం తప్పుతుందని, లేకుంటే పరిస్థితి చేయి దాటిపోతుందని వైద్యనిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు.
రాకాసిరోగం.. కొత్తేమీ కాదు
మ్యుకర్ ​మైకోసిస్​ కొత్త రోగమేమి కాదు. షుగర్​కంట్రోల్​లేనివారు, కిడ్నీ ట్రాన్స్​ప్లాంటేషన్ ​చేసుకున్నవారిలో ఇమ్యూనిటీని అణిచిపెట్టేందుకు మందులు వాడిన వారిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించేవి. ఇప్పుడు కరోనా ట్రీట్​మెంట్​భాగంగా అధికంగా స్టెరాయిడ్స్​వాడిన వారిలోనూ అధికంగా కనిపిస్తోంది. అయితే కరోనా మొదటి దశలో స్టిరాయిడ్స్​వాడకం అధికంగా లేకపోవడం వల్ల అప్పట్లో కనిపించలేదు. ఇప్పుడు స్టిరాయిడ్స్​వాడకం పెరగడంతో బ్లాక్​ఫంగస్​కేసులు నమోదవుతున్నాయి.
లక్షణాలు ఇలా..తలభాగంలో ముఖ్యంగా చెంపల కిందుగా ముక్కు, చెవులు, కళ్లు, పళ్లు, దవడల్లోకి ఫంగస్ ​విస్తరిస్తుంది. అరుదుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. అప్పుడు ఛాతీ నొప్పి, దగ్గు వస్తాయి. ముక్కు దిబ్బడ ఎండిపోయినట్లు ఉండడం, ముక్కులో అసౌకర్యం, దురద, ముక్కు నుంచి రక్తం, బూడిదరంగు, నల్లటి స్రావాలు కారడం అవుతుంది. ముఖంపై నొప్పి, తిమ్మిరి, వాపు, మొద్దుబారడం, తలనొప్పి ఉంటుంది. కనుగుడ్డు చుట్టూ నొప్పి, కనుగుడ్డు ముందుకు పొడుచుకురావడం, కళ్లు మసకబారడం, ఒకే వస్తువు రెండుగా కనిపించడం వంటివి ఉంటాయి.జ్వరం, దవడలు, పైవరుస పళ్ల నొప్పి ఉంటుంది.
త్వరగా గుర్తిస్తేనే మేలు
బ్లాక్​ఫంగస్​మొదట్లో ముక్కు లోపలికి చేరి, క్రమంగా సైనస్​గదుల్లోకి చొరబడుతుంది. దీన్ని తొలిదశలోనే గుర్తించి యాంఫోటెరిసిన్​–బీ ఇంజక్షన్లు ఇవ్వడం ద్వారా నియంత్రించవచ్చు. దీని 2,3 వారాలు పడుతుంది. వ్యాధి బాగా ముదిరితే ఫంగస్​వ్యాపించిన కణజాలాన్ని తొలగిస్తారు. కంటికి సోకితే కనుగుడ్డు తీసివేయాల్సి ఉంటుంది. పై వరుస పళ్లు తొలిగించాల్సి వస్తుంది. అయితే ఈ వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే 90శాతం నయం చేయొచ్చు.
అందరికీ రాదు
బ్లాక్​ ఫంగస్​వ్యాధి కరోనా రోగులందరికీ రాదని గుర్తించాలి. వంద మందిలో ఒకరికో ఇద్దరికో వస్తుంది. సైనస్​లోకి ఫంగస్​చేరకముందే ట్రీట్​మెంట్​ప్రారంభిస్తే త్వరగా నయం చేయొచ్చు. కరోనా నుంచి కోలుకున్నాక వ్యాధి నిరోధకశక్తి పెంచుకునేందుకు మంచి ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు గుడ్లు, మాంసం, చేపలు, ‘సి’ విటమిన్​ఉండే పండ్లు బాగా తినాలి. ఎక్కువ రెస్ట్​తీసుకోవాలి. 8గంటల పాటు నిద్రపోవాలి. ఆందోళన లేకుండా ఉంటే రెసిస్టెన్స్ ​పవర్​ఎక్కువగా పెరుగుతుంది.
ముందుగా గుర్తిస్తే ప్రమాదం కొంత తప్పినట్లే..

ఆస్పత్రిలో చేరి కొవిడ్ ట్రీట్ మెంట్ తీసుకున్న పేషెంట్లు డిశ్చార్జ్ అయిన ఒకటి రెండు రోజుల్లో బ్లాక్ ఫంగస్ వ్యాధి ఆధారిత లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువగా ఐదు రోజులక మించి ఆక్సిజన్ సపోర్టు తీసుకున్నవారిలో కనిపిస్తుంది. సరైన పద్ధతుల్లో నిల్వచేయని ఆక్సిజన్ సిలిండర్లను వాడడం ద్వారా బ్లాక్ ఫంగస్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. సాధారణ డిస్ట్రిల్లర్ వాటర్ తో శుద్ధిచేయాలి. ఈ వ్యాధి సంక్రమించిన వారికి సాధారణంగా ముక్కులో నల్లటి మచ్చలు ఏర్పడతాయి. అలాంటి రోగులు త్వరగా గుర్తించి యాంటి ఫంగల్ ట్రీట్ మెంట్ ప్రారంభించాలి. సరైన సమయంలో గుర్తించి ట్రీట్ మెంట్ చేయకపోతే ముక్కు నుంచి కళ్లకు.. అక్కడి నుంచి బ్రెయిన్ కు వైరస్ సోకుతుంది. కళ్లకు సోకినప్పుడు కంటిచూపు పోతుంది. ఒక్కోసారి కన్నుగుడ్డును తీసివేయాల్సి ఉంటుంది. బ్రెయిన్ కు చేరుకున్నప్పుడు పెరాలసిస్, ఇలా క్రమంగా శరీర అవయవాలు ఫెయిలై గుండెపోటుతో మరణం సంభవించే ప్రమాదం ఉంది. నాగర్ కర్నూల్ జిల్లాలో అలాంటి కేసులేవీ ఇప్పటివరకు నమోదు కాలేదు.
:: డాక్టర్ బి.కృష్ణ, మెడికల్ ఆఫీసర్, తాడూరు, నాగర్ కర్నూల్ జిల్లా