- పాల్గొన్న పార్టీ చీఫ్ జేపీ నడ్డా
- సికింద్రాబాద్ గాంధీ విగ్రహం
- నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ
- బండి సంజయ్ అరెస్ట్ ను ఖండించిన నేతలు
సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు బీజేపీ నాయకులు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నడ్డాతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ ఛుగ్, ఇతర నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు నాలుగు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ కు చేరుకున్న నడ్డాకు ఆ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ నాయకులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్తరుణ్ చుగ్, లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, విజయశాంతి, రామచంద్రరావు, కాసం వెంకటేశ్వర్లుతో భేటీ అయ్యారు. ఈనెల 5, 6, 7 తేదీల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సమావేశాలు జరగనున్నాయి. వాటిలో పాల్గొనేందుకు జేపీ నడ్డా నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉంటారు. ఈ సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు కార్యవాహ్దత్తాత్రేయ హోసబలే, ఐదుగురు సహ కార్యవాహ్‌లతో పాటు వీహెచ్‌పీ, ఏబీవీపీ, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.