Breaking News

కుప్పకూలిన బిపిన్​రావత్ హెలిక్యాప్టర్​

కుప్పకూలిన బిపిన్​రావత్ హెలిక్యాప్టర్​
  • 13 మంది దుర్మరణం
  • తమిళనాడులోని కూనూరు సమీపంలో దుర్ఘటన

న్యూఢిల్లీ: చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ కుప్పకూలింది. వారు వెళ్తున్న ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ బుధవారం తమిళనాడులోని కూనూరు సమీపంలో సాంకేతికలోపం తలెత్తింది. సమయంలో అందులో ఆర్మీ చీఫ్​తో పాటు ఆయన సతీమణి మధులికా రావత్, బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిడ్డర్‌, లెప్టినెంట్‌ కల్నల్‌ హర్జిందర్‌ సింగ్‌, నాయక్‌ గుర్‌సేవక్‌ సింగ్‌, నాయక్‌ జితేందర్‌ కుమార్‌, లాన్స్‌ నాయక్‌ వివేక్‌ కుమార్‌, లాన్స్‌ నాయక్‌ బి.సాయితేజ, హవల్దార్‌ సత్పాల్‌తో కలిపి మొత్తం 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మొదట ఐదుగురు దుర్మరణం పాలైనట్లు సమాచారం అందిందింది. క్రమంగా మృతుల సంఖ్య పెరిగింది. ఈప్రమాదంలో గాయపడిన బిపిన్‌ రావత్‌ తో దంపతులను ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు.

గాయపడిన వారిని తీసుకెళ్తున్న సైనికులు

ఎక్కడి నుంచి ఎక్కడికి..
తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో మిలిటరీ కాలేజీలో లెక్చర్‌ ఇచ్చేందుకు బుధవారం ఉదయం 9 గంటలకు ఆర్మీ చీఫ్​ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక రావత్‌, మరికొంతమంది ఆర్మీ అధికారులు కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడుకు బయలుదేరివెళ్లారు. ఉదయం 11.35 గంటల సమయంలో సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ల్యాండ్‌ అయింది. అక్కడి నుంచి వీరంతా ఎంఐ-17వీ5ఎఫ్‌ హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌కు బయలుదేరివెళ్లారు. మార్గమధ్యంలో మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో కట్టేరీలోని నంచప్పచత్రం ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఒక్కసారిగా కూలిపోయింది. అటవీ ప్రాంతంలో చెట్టుపై కూలడంతో ఒక్కసారిగా భీకరమైన మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో హెలికాప్టర్‌ నుంచి నలుగురు ప్రయాణికులు మండుతూ కిందపడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం వెల్లింగ్టన్‌ ఆర్మీ క్యాంపునకు కేవలం 16 కి.మీ. దూరంలో ఉంది. మరో ఐదు నిమిషాల్లో ఆర్మీ క్యాంప్‌లో హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవ్వాల్సి ఉండగా, అంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. ఈఘటనపై రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రహోం మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ నేతలు రాహుల్​గాంధీ, పలు పార్టీల నేతలు ఈ ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హెలిక్యాప్టర్​ కూలిన ప్రమాదస్థలం