- కఠోర ప్రయత్నం వల్లే ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమైంది
- ఉపనదులను జీవనదులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే
- రైతుగర్వంగా సమాజంలో తలెత్తుకుని బతకాలన్నదే ఆయన ఆశ
- ‘సారథి’ ఇంటర్వ్యూలో సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
సారథి, మెదక్: ప్రణాళికతో గోదావరి నీళ్లు మళ్లించి జీవం కోల్పోయిన ఎన్నో వాగులు, ఉప నదులు, చెక్‌డ్యాంలు, చెరువులకు సజీవ సాగునీటి వనరులుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకే దక్కిందని ఆయన రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ప్రణాళిక ఫలితంగా మెదక్ జిల్లాలోని అనేక సాగునీటి వనరులకు జీవకళ వచ్చిందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌నుంచి విడుదల చేసిన నీరు మంజీరా నది ద్వారా కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్తున్న సందర్భంగా ఆయనతో ‘సారథి’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
సారథి: వాగులు, మంజీరా నదిపై నిర్మించిన చెక్‌డ్యాంల వల్ల కాళేశ్వరం జలాలతో ఎంత మేర ప్రయోజనం చేకూరనుంది?
ఎమ్మెల్సీ: రాష్ట్రంలో టీఆర్ఎస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హల్దీవాగు, మంజీరా నది మీద 30 చెక్ డ్యాంలు నిర్మించాం. కొండపోచమ్మ సాగర్‌నుంచి విడుదల చేసిన గోదావరి జలాలతో ఆ చెక్‌డ్యాంలు అన్ని నిండాయి. ఫలితంగా హల్దీవాగు, మంజీరా నదిపరీవాహక ప్రాంతంలో దాదాపు 3 కి.మీ. మేర భూగర్భజలాల మట్టం పెరగనుంది. తూప్రాన్, మాసాయిపేట, వెల్దుర్తి, కొల్చారం, మెదక్, ఘనపూర్, పాపన్నపేట మండలాల్లో వేలాది ఎకరాల రైతులకు లబ్ధిచేకూరనుంది.
సారథి: వేసవి కాలంలో కాళేశ్వరం జలాలు మెదక్ జిల్లాకు వస్తాయని ఎవరైనా ఊహించారా?
ఎమ్మెల్సీ: ఇది ఊహకు అందని విషయం. ఎవరు, ఎప్పుడు అనుకోలేదు. ఇది కేవలం తెలంగాణ రైతాంగాన్ని ఆర్థికంగా ఎదిగేలా చేయడానికి అపర భగీరథుడు కేసీఆర్ ముందు చూపు ఫలితమే. 22 ఏళ్లపాటు కేసీఆర్ వెంట ఉన్న ఓ నిబద్ధత గల కార్యకర్తగా నేను మాత్రం కేసీఆర్ గారు గోదావరి నీళ్లను మెదక్ జిల్లాకు తప్పకుండా తెప్పిస్తారని నమ్మాను. ఎందుకంటే కఠోర ప్రయత్నం వల్ల అనితర సాధ్యమైన ప్రాజెక్టుల నిర్మాణం మూడేళ్లలో పూర్తయినందుకు ఆయన శిష్యుడిగా గర్వంగా ఉంది.
సారథి: కాళేశ్వరం నీరు రెండు పంటలకు నిరంతర వ్యవసాయానికి అందుబాటులో ఉంటాయా?
ఎమ్మెల్సీ: కచ్చితంగా ఉంటాయి, రైతు గర్వంగా సమాజంలో తలెత్తుకుని బతకాలన్నదే ముఖ్యమంత్రి ఆశ. ఐతే రెండు పంటలకు నీరు అందించడం ద్వారా నీటి కొరత రాదు. కానీ రైతులు ఒకే పంట వేయాలన్న ఆలోచన కాకుండా విభిన్న రకాల పంటలు వేయడం ద్వారా మరింత అభివృద్ధి చెందుతారని ఆ వైపు రైతాంగం ఆలోచించాలి.
సారథి: ఎక్కడైనా నది నీళ్లు ఉపనదిలో కలిసిన సందర్భాలు ఉన్నాయా?
ఎమ్మెల్సీ: నాకు తెలిసి ఎక్కడైనా ఉపనదులే నదులకు జీవధారలుగా ఉంటాయి. కానీ గత పాలకుల నిర్లక్ష్య ధోరణి కారణంగా ఉపనదులన్నీ ఒట్టిపోయాయి. కొన్నిచోట్ల నీటి లభ్యత లేక పిచ్చిమొక్కలతో నిండాయి. ప్రపంచంలో ఎవరూ ఊహించని విధంగా ఉపనదులను కూడా జీవనదులుగా మార్చిన ఘనత కేసీఆర్ గారిదే. బృహత్తర ప్రణాళికతో ఉపనదుల్లో నిర్మించిన చెక్ డ్యాంల వల్ల గొలుసు కట్టులా నీటి ప్రవాహం ఎక్కడికక్కడే నిల్వ ఉండటం మూలంగా కిలోమీటర్ల మేర నీరు నిలవడం, తద్వారా వేల ఎకరాల సాగుకు అవకాశం లభించింది.
సారథి: కాళేశ్వరం జలాల వల్ల పర్యావరణం ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు?
ఎమ్మెల్సీ: ఈ నదుల ద్వారా నదీ పరీవాహక ప్రాంతమంతా నీటి లభ్యత ఉండటంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. జలకళ ఉంటే వృక్షసంపద, మత్స్య సంపద, జీవసంపద వృద్ధి చెందుతుంది. పక్షుల సంచారం పెరుగుతుంది. పల్లెలో రైతులు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉండటంతో వలసలు తగ్గిపోతాయి.
సారథి: మంజీరా నదిపై మొదటి చెక్ డ్యాం నిర్మించడం, ఆ నిర్మాణం ప్రయోజనాల మూలంగా మరిన్ని చెక్ డ్యాంలు మంజూరు కావడం పట్ల మీ అనుభూతి ఏమిటి?
ఎమ్మెల్సీ: జిల్లా ప్రజలు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు మంజీరా నదిమీద, హల్దీవాగు మీద చెక్ డ్యాంల నిర్మాణం కోసం ఎన్నోసార్లు విన్నవించినా అప్పటి పాలకులు సీమాంధ్ర తొత్తులుగా ఉండి వీటి గురించి పట్టించుకోలేదు. వర్షాకాలంలో వచ్చే వరద నీటిని సైతం నిలుపుకోలేక ప్రజలకు అవస్థలు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితులను గమనించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ రైతాంగాన్ని కాపాడే ఉద్దేశంతో చేస్తున్న కృషిని దగ్గరగా చూశాను. మా జిల్లాలో కూడా చెక్ డ్యాంల ఆవశ్యకతను పెద్ద సార్ దృష్టికి తీసుకెళ్లగా అడిగిన వెంటనే హవేలి ఘనపూర్మండలం కూచనపల్లి వద్ద మంజీరా నదిపై తొలి చెక్ డ్యాం మంజూరు చేశారు. యుద్ధ ప్రాతిపదికన నాలుగు నెలల కాలంలో దీని నిర్మాణం పూర్తి చేయించాం. ఈ చెక్‌డ్యాం ఫలితంగా 5 కి.మీ. మేర నీటి నిల్వ ఏర్పడి 8 గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరింది. ఈ ఒక్క చెక్ డ్యాం నిర్మాణం వల్ల ఒనగూరిన ప్రయోజనం ఫలితంగా మరో 12 చెక్ డ్యాంలు ముఖ్యమంత్రి మంజూరు చేయడం చెప్పలేనంత ఆనందంగా ఉంది.