- కరోనా నిలకడగానే ఉంది
- మూడో దశ ముప్పుపట్ల అప్రమత్తంగా ఉండాలి
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సామాజిక సారథి, హైదరాబాద్: కరోనా విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పాఠశాలల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మంత్రి సోమవారం కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. విద్యాసంస్థల్లో ఎవరికి వారు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో ఉండే విద్యార్థులు అప్రమత్తంగా ఉండేలా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. రాష్ట్రంలో పలు విద్యాసంస్థల్లో కరోనా కేసులు వెలుగు చూస్తున్నందున విద్యార్థులందరికీ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యాసంస్థల్లో టీచర్లు, సిబ్బంది ప్రతిఒక్కరూ రెండు డోసు టీకా వేసుకునేలా ఆయా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు. శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ మిషన్లను విద్యాసంస్థలు తప్పనిసరిగా వినియోగించేలా చూడాలని ఆదేశించారు. ప్రస్తుతం కరోనా కేసులు నిలకడగా ఉన్నా, మూడో దశ ముప్పు ఉందన్న నేపథ్యంలో అన్నిస్థాయిల విద్యాసంస్థల్లో అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టేందుకు తగిన ఆదేశాలను జారీచేయాలని సూచించారు. విద్యాశాఖ అధికారులు, యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల సమన్వయంతో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు.