Breaking News

కాంగ్రెస్ లో చిల్లర బ్యాచ్

కాంగ్రెస్ లో చిల్లర బ్యాచ్
  • నాపై తప్పుడు ప్రచారం
  • రేవంత్‌ రెడ్డి కూడా కోవర్టే
  • మంత్రి కేటీఆర్​ను నిధులు అడగటం తప్పా?
  • గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సామాజికసారథి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌కు కోవర్ట్‌ అంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. కొద్దిరోజుల క్రితం తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారని వివరించారు. ఆ కార్యక్రమంలో మంత్రిని నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కావాలని కోరినట్లు వెల్లడించారు. తన నియోజకవర్గ అధికార కార్యక్రమానికి వచ్చిన మంత్రితో తాను మాట్లాడిన అంశాన్ని కొందరు పనిగట్టుకొని నెగిటివ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..  అధికారిక కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ పార్టీ వారైనా సక్యతతో మెలగాల్సిందేని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అధికారపార్టీ మంత్రులను నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడగడం తప్పా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో చిల్లర బ్యాచ్ ఒకటి తయారైందని, టీఆర్ఎస్ పార్టీలోకి పోవాలంటే నేరుగా వెళ్తానని తప్పుడు ప్రచారం చేయొద్దని ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. టీపీసీసీలో నచ్చని అంశాలను సరిచేసుకోవాలని చెప్పడం తప్పా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్‌ను చాలా విషయాల్లో వ్యతిరేకించినా.. పార్టీ మారుతున్నానని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను కోవర్ట్‌ అయితే.. రేవంత్‌ కూడా కోవర్టే అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

రేవంత్​పై చర్యలేవీ?

‘చెన్నారెడ్డిని దించడానికి వైఎస్సార్​ప్రయత్నం చేసినట్లుగా కూడా ప్రచారం జరిగేది. కేటీఆర్ తో కలిస్తే కండువా కప్పినట్టు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు ఎవరు లేరా..?

 పీసీసీ అంటే బస్సుకు డ్రైవర్ లాంటోడే. బస్సు సక్కగా లేకుంటే సరిద్దిద్దుకో అని చెప్పిన. ఇది కూడా చెప్పొద్దా..?. సీఎం కేసీఆర్ నా కంటే పెద్ద.. తిట్టను. నాకంటూ ఓ పద్ధతి ఉంటది. ఉద్యమం సమయంలో కేసీఆర్​ను సంగారెడ్డికి ఎట్లా వస్తవోరా..? అని ఎదురునిలబడిన. నా కంటే ఎక్కువ కొట్లాట చేసిర్రా ఎవరన్నా..? టీఆర్ఎస్​ను నేను కోవర్టు అని రాసిన సోషల్ మీడియాలోనే.. మూడేళ్లుగా పీసీసీ చీఫ్​గా రేవంత్ అని రాశారు. పీసీసీ కాకముందే అంత ప్రచారం చేసుకున్న రేవంత్ పై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. మరి కిషన్ రెడ్డి, కేటీఆర్ కలిసి దిగిన ఫొటో ఇవాళ వచ్చింది. దీన్ని ఏమంటారు.? కేటీఆర్..రేవంత్ అసెంబ్లీ లో లాక్కుంటున్న ఫొటోలు వచ్చాయి. దీన్ని ఏమనాలి.’ అని అన్నారు.

5వ తేదీన అన్నీ మాట్లాడతా..

‘తమాషా చేస్తున్నారా..? బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..? తీన్మార్ మళ్లీగాడు తోపు అనుకుంటున్నారా? వాడి బ్లాక్ మెయిల్ సంగతి తెలియదా .? నన్ను ఏజెంట్ అనడానికి నువేవడివి..?

నేను కోవర్ట్ అయితే… రేవంత్ కూడా కోవర్టే. ఐదో తేదీ సమావేశంలో ఇవన్నీ మాట్లాడతా.. చిన్నారెడ్డి నీ కూడా అన్నీ అడుగుతా.. కాంగ్రెస్ ఎప్పటి నుంచో గట్టిగా ఉంది. ఎవడో వచ్చి కాంగ్రెస్ ను లేపాల్సిన పనిలేదు. సోనియా, రాహుల్.. తర్వాత ప్రియాంక గాంధీ లదే పార్టీ. ఇలాంటి వ్యక్తిగత సినిమా చూపిస్తే ఊరుకోం. కాంగ్రెస్ లోనే ఉంటాం. అవసరం వచ్చినప్పుడు కేటీఆర్, హరీశ్, కేసీఆర్​ను అడ్డంగా నరుక్కుంటు మాట్లాడతా..? చిన్నారెడ్డి ప్రకటన వెనక రేవంత్ హస్తం ఉంది. చిన్నారెడ్డి సోనియా గాంధీ డైరెక్షన్ లో లేరు. రేవంత్ డైరెక్షన్ లో ఉన్నారు.’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.