- భారీగా పోలీసుల మోహరింపు
సామాజిక సారథి, కరీంనగర్: జీవోనం.317ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సంఘీభావంగా కరీంనగర్‌లో ఆదివారం రాత్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన క్యాంపు కార్యాలయం వద్ద జాగరణ దీక్ష చేపట్టారు. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో దీక్షకు అనుమతి లేకపోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని ఎంపీ బండి సంజయ్ బైక్ పై క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. 317 జీవో వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతోందని, సొంత జిల్లాలో కూడా పరాయివాడిగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తక్షణమే ఈ జీవోను సవరించి, అందుకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు తన దీక్షను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. నల్లగొండలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు అనుమతించిన పోలీసులు తమకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అనంతరం బండి సంజయ్ కార్యాలయం లోపల దీక్ష కొనసాగించారు. పోలీసులు దీక్షకు అనుమతి లేదని భారీగా మోహరించి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కరోనా నిబంధనల పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారని, రూల్స్ అధికార పక్షానికి ఉండవా? అని బండి సంజయ్ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలపై చేయి చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. పోలీసులు బండి సంజయ్ దీక్ష చేస్తున్న క్యాంప్ కార్యాలయాన్ని చుట్టుముట్టి కార్యాలయం గేటును పగలకొట్టారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.