- ఐదు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
- 4 ఒమిక్రాన్ కేసులు నమోదు
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ దేశంలో భయాందోళనలకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న ఐదు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం శనివారం హెచ్చరికలు జారీచేసింది. ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మిజోరం, జమ్మూ కాశ్మీర్ లో రోజువారీగా కరోనా కేసులు, మరణాల రేటు వేగంగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ లోని కథువా జిల్లాలో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 మధ్య వారంలో కరోనా కేసుల నమోదు 727 శాతం పెరిగింది. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో కేసులు 152 శాతం పెరిగాయి. తమిళనాడులోని మూడు జిల్లాల్లో కొత్తకేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. మిజోరంలోని సైహా(237 శాతం) సహా నాలుగు జిల్లాలు, ఒడిశాలోని దేకనల్(667 శాతం)లో కరోనా కేసులు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.
4 ఒమిక్రాన్ కేసులు నమోదు
భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి చెందిన 33 ఏళ్ల వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. అతడు గత నెల దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్, ఢిల్లీ మీదుగా ముంబై చేరుకున్నాడు. కొవిడ్ పరీక్ష చేయగా ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ వచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది. అతడు ఇప్పటివరకు ఎలాంటి కొవిడ్ వ్యాక్సిన్తీసుకోకపోవడం గమనార్హం. గతనెల 24న అతడు ముంబై చేరుకున్న తర్వాత అతనికి జ్వరం వచ్చింది. దీంతో పరీక్షలు చేయగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడినట్లు తాజాగా గుర్తించారు. అతడితో పాటు ప్రయాణించిన వారికి పరీక్షలు చేయగా అందరికీ నెగటివ్‌గా తేలింది. తాజా కేసుతో కలిపి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే కర్ణాటకలో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు కేంద్రం వెల్లడించగా, శనివారం గుజరాత్ రాష్ట్రంలోని జామ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. అతడు ఇటీవల జింబాబ్వే నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు.