- భూముల లాక్కుంటే పేదలు బతికేదెట్లా?
- బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలే ముఖ్యమా?
- అబద్ధాల కేసీఆర్పాలనకు చరమగీతం పాడాలి
- బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
సామాజిక సారథి, కామారెడ్డి: ‘అసైన్డ్భూములు ఏమైనా మీ తాత జాగీరా..? భూములు గుంజుకుంటే ఈ పేద రైతులు ఎలా బతకాలి’ అని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మీ ఫామ్ హౌస్ భూములను గుంజుకుంటే ఊరుకుంటారా? పేదలు మీకు ఓటేసింది ఇందుకోసమేనా? అని సీఎం కేసీఆర్‌ను నిలదీశారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా సదాశివపేట్, తాడ్వాయి మండలాల్లోని లింగపల్లి, జనగామ్, కారడ్ పల్లి గ్రామాల్లో జూట్ పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరాహారదీక్ష చేపట్టిన రైతుల ఆయన మద్దతు పలికారు. రైతులు తమ సమస్యలను ఒక్కొక్కరుగా ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ఆర్ఎస్ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. పేద రైతులు సాగు చేసుకుంటున్న పచ్చని పంటపొలాల్లో జూట్ పరిశ్రమలు ఏర్పాటుకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా బలవంతంగా భూమిని తీసుకోవడం అన్యాయమన్నారు. ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్న భూములను పరిశ్రమలకు కేటాయించకుండా, కేవలం పేదలు సాగుచేసుకుంటున్న అసైన్డ్భూములను మాత్రమే గుంజుకోవడం వెనక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయం కోసం ధర్నాచేస్తున్న రైతులను రెవెన్యూ, పోలీసులు అధికారులు భయాభ్రాంతులకు గురిచేయడం మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షలాది ఎకరాల అసైన్డ్‌మెంట్ భూములపై క్రయక్రయాలకు హక్కులు కల్పిస్తామని తెలిపారు. అబద్ధాల కేసీఆర్ పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడాలని కోరారు.ప్రగతి భవన్ పై బీఎస్పీ జెండా ఎగరవేసి బహుజన రాజ్యం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఆయన వెంట బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
తెలంగాణకు విముక్తి కల్పించడమే బీఎస్పీ లక్ష్యం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో బీఎస్పీ జిల్లా కార్యాలయాన్ని రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కల్పించడమే బీఎస్పీ లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల నాటికీ రాష్ట్రంలో బీఎస్పీ బలమైన శక్తిగా ఎదిగి అధికారం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. జనాభాలో సింహ భాగం ఉన్న బహుజనులకు రాజకీయ అధికారం ద్వారానే అభివృద్ధి లభిస్తుందన్నారు. తెలంగాణలో సైనిక స్కూలును ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గురుకుల కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా సంక్షేమ సైనిక పాఠశాలలతో పాటు మహిళలకు సైనిక గురుకుల డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.