Breaking News

నిఖిత హత్య పై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి

-ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ..

సామాజిక సారథి , అచ్చంపేట: మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అనుమానాస్పదంగా నిఖిత హత్య దోషుల వైపు ఎవరున్నా రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ , ఎస్సీ , ఎస్టీ , బీసీ మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు జెట్టి ధర్మరాజులు అన్నారు. గురువారం అచ్చంపేట పట్టణంలోని నిఖిత మృతిని నిరసిస్తూ అఖిలపక్షం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణ బందుకు పిలుపునిచ్చి నిరసన ర్యాలీ నిర్వహించారు . ధర్నాను ఉద్దేశించి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ , ఎస్సీ , ఎస్టీ , బీసీ మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ధర్మరాజులు మాట్లాడుతూ నికిత మృతిపై అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు కలిసి ఆందోళనకు పిలుపునిచ్చినప్పటికి , బీఆర్ఎస్ అధికార పార్టీ నిఖిత నిందితుల వైపు ఉన్నట్లు కనపడుతుందని అందులో ఉన్న వారు ఎమ్మెల్యే అయినా ఎంతటి వారైనా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు . అచ్చంపేట బంద్ కు అఖిలపక్షం ప్రజాసంఘాలు పిలుపు ఇచ్చినప్పటికీ అధికార పార్టీ బందును భగ్నం కుటిల ప్రయత్నాలు చేసిందని వారు ఆరోపించారు .

నికిత మృతి చెందిన వెంటనే సంబంధిత కుటుంబ సభ్యులకు పోలీసువారికి సమాచారం ఇవ్వవలసినప్పటికీ ఆలస్యంగా ఇవ్వడంలో అంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. నికిత మృతి పై సీటింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే మృతి వెనుక ఉన్న దోషులు బయటికి రావడంతో పాటు వాస్తవాలు వారి కుటుంబ సభ్యులకు సమాజానికి తెలిసే అవకాశం ఉందన్నారు. మంచి లక్ష్యంతో మంచి ఆశయంతో ప్రారంభించిన గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంలో పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం ఉదాసీనత కారణమన్నారు. అధికార పార్టీ నిందితులను కాపాడే ప్రయత్నంలో ఉందన్న సంగతి ఈ ధర్నాలో వారు పాలుపంచుకోకపోవడాన్ని బట్టి తెలుస్తుందన్నారు.గురువారం అఖిలపక్షం ప్రజా సంఘాలు ఇచ్చిన అచ్చంపేట పట్టణ బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది . ఈధర్నా కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కరిగిళ్ళ దశరతం , సౌట ఖాసీం, అంతటి మల్లేష్, గుటా విజయ్ , బిజెపి నాయకులు సతీష్ మాదిగ, టిడిపి నాయకులు మోపతయ్య, మాజీ ఎంపీపీ రామనాథం, కాశన్న యాదవ్, మహబూబ్ అలీ, కుందా మల్లికార్జున్, సిపిఎం నాయకులు దేశ్యానాయక్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.