ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు
సామాజికసారథి, నాగర్ కర్నూల్: హమారా ప్రసాద్ దేశద్రోహి అని ప్రజాసంఘాల నేతలు అన్నారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం, కేవీపీపీఎస్, తెలంగాణ దండోరా, మాలమానాడు, మహిళా సంఘాలు, ఇతర దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యఅతిథిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు పాల్గొని అంబేద్కర్ కు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ హక్కుల మహానేత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను చంపేవాడినని హమారా ప్రసాద్ అనడం సిగ్గుచేటన్నారు. కోట్లాది దళిత బహుజనులు, హిందువులు, దేశ ప్రజలను అవమానించడమే కాకుండా అగౌరపరిచాడని మండిపడ్డారు. హమారా ప్రసాద్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పీడీ యాక్ట్ నమోదుచేయాలని, దేశద్రోహిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరవృతం కాకుండా, ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న, తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపి, మహిళా సంఘం నాయకురాలు రేణుక లక్ష్మి, బాలమణి, ప్రభాకర్, బీసీసంఘం నాయకుడు వెంకటయ్య, ఎమ్మార్పీఎస్ నాగరాజు, మాల మహానాడు నాయకుడు ప్రభాకర్, హమలీ సంఘం నాయకులు రవి, ప్రజాసంఘాలు, దళిత సంఘాలు పాల్గొన్నాయి.