Breaking News

దిలీప్​.. నీ స్థాయి తెలుసుకో

దిలీప్​.. నీ స్థాయి తెలుసుకో

ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డిపై వ్యాఖ్యల నేపథ్యంలో టీఆర్ఎస్​ నాయకుల కౌంటర్​

సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి నల్లమట్టి వ్యాపారం చేస్తున్నారని బీజేపీ జిల్లా నాయకుడు దిలీప్ ఆచారి చేసిన ప్రకటన నాగర్ కర్నూల్ లో రాజకీయంగా దుమారం రేపుతోంది. బిజినేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గంగనమోని కిరణ్, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగి విజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దిలీప్ చారి వ్యాపారాలపై పలు విమర్శలు చేశారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని విమర్శించే ముందు నీస్థాయిని తెలుసుకోవాలని ఘాటుగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఉన్నప్పుడు నీవుచేసిన వ్యాపారం ఇక్కడి ప్రజలకు తెలుసునని గుర్తుచేశారు. కోట్లాది రూపాయలు సంపాదించి సొంత ఊరుకు కూడా నీవు ఏమీ చేయలేకపోయావని విమర్శించారు.

ప్రాజెక్టుకు నల్లమట్టి లేనిదే నిర్మాణం జరుగుతుందా? అది కూడా నీకు తెల్వకుండా నల్లమట్టిలో ఎమ్మెల్యే ప్రమేయంపై తప్పుడు ప్రచారం చేస్తే నియోజవర్గంలోని ఏ గ్రామం కూడా నీవు తిరగలేవని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేపై చేసిన ప్రకటనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో బీజేపీ ముసుగులో నీవు చేస్తున్న అక్రమ వ్యాపారులపై ప్రజలకు తెలియజేస్తామని హెచ్చరించారు. నాగర్ కర్నూల్ లో కేవలం ఎన్నికల ముందు కు మాత్రం వచ్చి లక్షల రూపాయలు వసూలు చేసుకుని కార్యకర్తలను నిండా ముంచి.. ఎన్నికల తర్వాత నియోజకవర్గ కార్యకర్తల సమస్యలు ఎప్పుడైనా నీవు పట్టించుకున్నావా? అని నిలదీశారు. అన్నివర్గాల ప్రజలకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దగ్గరవుతున్నాడని, అది చూసి జీర్ణించుకోలేక దిలీపాచారి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.