Breaking News

యాదాద్రి సన్నిధిలో అఖండ బృందం

యాదాద్రి సన్నిధిలో అఖండ బృందం
  • ఆలయాభివృద్ధి చిరస్థాయిగా ఉంటుంది
  • సీఎం కేసీఆర్ పై బాలయ్య ప్రశంసలు

సామాజికసారథి, యాదాద్రిభువనగిరి: యాదాద్రి పునర్​నిర్మాణంలో సీఎం కేసీఆర్‌ చొరవ ప్రశంసనీయమని ఎమ్మెల్యే, నటుడు బాలయ్య కొనియాడారు. సోమవారం ఉదయం అఖండ సినీబృందం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నది. అఖండ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో బాలకృష్ణతో పాటు నటీనటులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్యకు దేవస్థానం అధికారులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయ మర్యాదలతో వారికి ఘనస్వాగతం పలికారు. ఆయన వెంట దర్శకుడు బోయపాటి శ్రీను, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వరెడ్డి తదితరులు ఉన్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మాట్లాడిన బాలయ్య .. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో సీఎం కేసీఆర్‌ చూపిన ప్రత్యేక చొరవ ప్రశంసనీయమన్నారు. భక్తులు కూడా ఆలయ విశిష్టత, స్వచ్ఛతను సంరక్షించాలని కోరారు. ‘అఖండ’ సినిమా సక్సెస్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నామని, అందులో భాగంగానే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వచ్చామని వెల్లడించారు. తన ఇష్టదైవం లక్ష్మీనరసింహస్వామి అని, తనపై స్వామివారి అనుగ్రహం ఉందన్నారు. ఈ ఆలయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. హిందూధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా బాలయ్య పేర్కొన్నారు.